గత కొద్దిరోజులుగా మియాపూర్ భూ కుంభకోణం ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దీనిపై తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంలో స్కాములేవీ లేవని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. మియాపూర్ విషయంలో మీడియాలో వస్తున్న కథనాల్ని కూడా ఆయన లైట్ తీసుకున్నారు. ఈ వ్యవహారం వల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సంబంధించి ఒక్క గజం స్థలం కూడా ఎక్కడికీ పోలేదనీ, దీనిపై అనవసరంగా రాద్దాంతం చేయాల్సిన పనిలేదంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు వరకూ వెళ్లాల్సిన పనిలేదన్నారు. రిజిస్టేషన్లలో అవకతవకలకు పాల్పడ్డవారిపై కేసులు పెట్టామని చెప్పారు.
ప్రభుత్వ భూములను తప్పుడు పత్రాలతో సొంతం చేసుకునే అన్ని రకాల ప్రయత్నాల్నీ సమర్థంగా అడ్డుకుంటామని కేసీఆర్ అన్నారు. దీనిపై అవసరమైన న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. జాగీరు భూములపై ప్రభుత్వానికి సర్వహక్కులు ఉంటాయని, ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులూ ఉండవని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చెయ్యడంలో ఎలాంటి చట్టబద్ధత ఉండదని కేసీఆర్ అన్నారు. మియాపూర్ వ్యవహారంపై ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించిన తరువాత కేసీఆర్ ఈ వివరాలను వెల్లడించారు.
అంటే, మియాపూర్ భూకుంభకోణం ఆరోపణలకి ఇక్కడితో కేసీఆర్ సర్కారు తెర దించేసే ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఉంది. ఇంకోపక్క.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ సంచలన ఆరోపణలు చేస్తూనే ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాగుతున్న భూదందాకి కేసీఆర్ కుటుంబ సహకారం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గవర్నర్ నరసింహన్ కు ఇచ్చిన వినతి పత్రంలో ఇదే విషయాన్ని పేర్కొన్నారు. మియాపూర్ భూ కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో సమగ్ర చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి తదితరులు గవర్నర్ ను కోరారు. గతంలో రేవంత్ రెడ్డి బయటపెట్టిన వివరాలను కూడా ఈ సందర్భంగా గవర్నర్ కు తెలిపారు.
ఒక ప్రముఖుడి బెంజ్ కారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికీ, ప్రగతీ భవన్ కీ తరచూ వస్తుండేదనీ.. ఈ కుంభకోణం కథనాలు వెలుగు చూడగానే ఆ కారు సీఎం దగ్గరకి వెళ్లడం లేదనీ… కొంతమంది పెద్దల్ని కేసీఆర్ కాపాడుతున్నారంటూ టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ ఆరోపణలపై ఎలాంటి వివరణ ఇచ్చే ప్రయత్నం కేసీఆర్ చెయ్యలేదు. కొన్ని కేసులు నమోదు చేశామనీ మాత్రమే చెప్పి, చాప్టర్ క్లోజ్ అనేశారు! ప్రభుత్వ స్థలం ఒక్క గజం పోకపోయినా.. వెల్లువెత్తిన ఆరోపణలపై కూడా సీఎం స్పందిస్తే క్లారిటీ ఉండేది. ఈ వ్యవహారానికి తెరాస తెర దించే ప్రయత్నం చేస్తున్నా… ప్రతిపక్షాలు అంత ఈజీగా వదిలేట్టుగా లేవు.