తప్పు చేస్తే.. దాన్ని తప్పించుకోవాల్సి వస్తే… కాంటాక్ట్ జె.సి. దివాకర రెడ్డి అంటున్నారు. అదేమిటి ఆయన ఎంపీ కదా.. ఇలాంటి పనులు ఆయనచేస్తారా అనుకుంటే తప్పు. ఎందుకంటే ఆయనే ఆ పని చేశారు. విశాఖ విమానాశ్రయంలో ఇండిగో సిబ్బందిపై దౌర్జన్యం చేసిన అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డిపై దేశీయంగా విమానాల్లో ప్రయాణించడానికి వీలు లేకుండా వైమానిక సంస్థలు నిషేధం విధించాయి. ఆలస్యమైనా దివాకర్ ప్రయాణానికి కేంద్ర మంత్రి జోక్యంతో అనుమతించిన సంస్థ తన తప్పిదాన్ని తప్పించుకోవడానికి ఆ విషయాన్ని బయటపెట్టింది. ఈ ఇబ్బందికరమైన తప్పించుకోడానికి అశోక్ గజపతి రాజు, దివాకర్ చెబుతున్నట్లుగా తాను ఈ అంశంలో జోక్యం చేసుకోలేదని ఓ ట్వీట్ చేయడం.. వివాదాన్ని ముదురుపాకాన పెట్టింది. అప్పటిదాకా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళని విషయం ఆయనకూ తెలిసిపోయింది. అసలే విశాఖ భూకుంభకోణం వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలా అనే అంశంపై తలమునకలైన ఆయన దివాకర్‌తో క్షమాపణ చెప్పించి, వివాదాన్ని ముగించాలని సూచించినట్లు సమాచారం. అభిమానధనుడైన జేసీ క్షమాపణ చెప్పడానికి ఒప్పుకుంటారా? అసలే ప్రతిష్టగల ఎంపీ ఆయె. పాపం అశోక్ గజపతి రాజు గారికి కూడా ఈ వ్యవహారం పీకమీద కత్తిలా తయారైంది. లోక్ సభలో తనపై దౌర్జన్యం చేయడానికే వచ్చిన శివసేన ఎంపీ గైక్వాడ్ క్షమాపణ చెప్పడంతో సద్దుకున్న కేంద్ర మంత్రికి దివాకర్ది అంత అర్రీబుర్రీగా తేలే వ్యవహారంలా కనిపించడం లేదు.
అందుకే జేసీ గారికి మధ్యేమార్గం కనిపించింది అదే.. విదేశాలకు విదేశీ విమానంలో చెక్కేయడం. ఎవరూ ఊహించని విధంగా ఆయన నిన్న రాత్రి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్‌కి అక్కడి నుంచి ప్యారిస్‌కి కుటుంబంతో సహా వెళ్ళిపోయారు… అలా అనే కంటే పారిపోయారనడం సమంజసంగా ఉంటుంది. జరిగింది తప్పని ఒప్పుకుని, క్షమాపణ చెప్పేసి ఉంటే హుందాగా ఉండి ఉండేది. ఎంపీ స్థాయిని నిలబెట్టినట్లూ ఉండేది. అసలు ఎంపీగా అలా ప్రవర్తించనే కూడదు. అక్కడితో ఆగకుండా మీడియాపై సెటైర్లు కడా వేశారాయన. మీడియా ఊరుకుంటుందా..ప్రతిపక్షం ఊరుకుంటుందా.. వెంటాడాయి.. తమ అనుభవాలను గుర్తుచేసుకుని మరీ దివాకర్‌ను చీల్చి చెండాడాయి. ఎలాగూ ఆయన దేశం విడిచివెళ్ళిపోయారు కాబట్టి..విమానా సంస్థలు కాస్త చురుగ్గా ఆలోచించాలి. దివాకర్ వ్యవహార శైలిని వివరిస్తూ విదేశాల్లోని అన్ని విమానయాన సంస్థలకూ లేఖలు రాయాలి. అక్కడ కూడా దివాకర్ విమాన ప్రయాణం ఎక్కకుండా నిషేధం తెచ్చేలా చేయాలి. అప్పుడు ఎంపీగారు ఏం చేస్తారో చూడాలి. ఆత్మాభిమాన నినాదంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ తన ప్రజా ప్రతినిదులకు తప్ప ఎవరికీ ఆత్మాభిమానం ఉండకూడదనీ, వారెలా ప్రవర్తించినా అందరూ సద్దుకుపోవాలనీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం సమంజసంగా ఉండదు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి