కాంగ్రెస్ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయినా ఎపిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి ఏదోలా తంటాలు పడుతున్నారు. ఇటీవల గుంటూరులో రాహుల్‌గాంధీ సభతో కొంత వూపిరి వచ్చిందనిపించాడు. ఇదే వూపులో తెలుగుదేశం ప్రభుత్వంపై ఒక ఛార్జిషీటు విడుదల చేశారు. చాలాకాలంగా తెలుగునాట ఇది సంప్రదాయంగా వస్తున్నదే. అయితే ఈ సందర్భంలో రఘువీరా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి ముడుపులు పంపిస్తున్నారని ఆరోపించడం కొత్త చర్చకు దారితీసింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అధిష్టానానికి ముడుపులు ఇస్తుంటారనే ఆరోపణ మొదటి నుంచి వుంది.బిజెపిలోనూ వనరుల సమీకరణ పెద్ద ఎత్తునే జరుగుతుంటుంది. అయితే రెండు పార్టీల మధ్యన ముడుపుల మార్పిడి కష్టమే. పైగా అంబానీ అదానీ వంటి హేమాహేమీ కార్పొరేట్లతో ముడిపడిన మోడీకి ఇక్కడ నుంచి చంద్రబాబు చేతులమీదుగా ముడుపులు తీసుకునే అవవసరం ఏముంటుంది? వారిద్దరి మధ్య ఆ విధమైన కెమిస్ట్రీ కూడా వున్నట్టు లేదు. అయితే ఎమోషన్లో రఘువీరా చేసిన ఈ వ్యాఖ్యతో బిజెపిని కూడా దూరం చేసుకున్నట్టయింది. లేకుంటే వారు కూడా తెలుగుదేశంపై విమర్శలను సగం సగం సమర్థిస్తూ విమర్శిస్తూ విన్యాసాలు చేస్తున్నారు. బిజెపి పెద్దన్నగా వెంకయ్య నాయుడే ఇక్కడి లావాదేవీలన్నీ చూస్తున్నారనేది వారి ఘోష కూడా. కోస్తా జిల్లాల్లో భారీ కేటాయింపులు కాంట్రాక్టులపై వెంకయ్య ముద్ర బలంగా వుందని బిజెపి వారే అంటుంటారు. మోడీ అమిత్ షాలు చంద్రబాబుకు ఆ అవకాశం ఇవ్వకుండా తమే పగ్గాలు చేపట్టాలని చూస్తున్నారు.వైఎస్ఆర్సిసితోనూ చెలిమి చేస్తున్నారందుకే.ఈ నేపథ్యంలో పిసిసి అద్యక్షుడు తన వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇవ్వొచ్చేమో… మాతో చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడైతే అది ముఖ్యమైన ఆరోపణ కాదని, ప్రాజెక్టులు నీరు చెట్టు వంటివాటిలో అవకతవకలు నిరూపించడానికి సిద్ధంగా వున్నామని అన్నారు.