కార్పొరేషన్ పదవి నుంచి మాజీ సీయస్ ఐవైఆర్ కృష్ణారావును ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత, ఆయన చంద్రబాబు సర్కారును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ పదవిలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ మాధ్యమాల్లో విమర్శలు చేయడమే ఆయన తొలగింపునకు కారణంగా చెప్పారు. ఐవైఆర్ చేసిన కామెంట్స్ కు ప్రభుత్వం తరఫున పరకాల ప్రభాకర్ ఖండించారు.
ముఖ్యమంత్రిని కలిసేందుకు గత ఆరునెలలుగా తాను ప్రయత్నిస్తున్నా అపాయింట్మెంట్ దొరకడం లేదన్న కృష్ణారావు వ్యాఖ్యల్ని పరకాల కొట్టిపారేశారు. సీఎంను కలిసేందుకు ఆయనకు ఎప్పుడూ స్వేచ్ఛ ఉందని చెప్పారు. తామంతా సీఎం దగ్గర ఉన్న సమయంలో ఆయన లోపలికి రాగానే, తాము లేచి వెళ్లిపోయిన సందర్భాలూ ఉన్నాయనీ, సీఎంకీ ఆయనకీ మధ్య ఆ చనువు కూడా ఉందని పరకాల చెప్పారు. ఈ మధ్య జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబును కృష్ణారావు కలిశారనీ, అంతకుముందు నెలల్లో కూడా కలుసుకున్నారని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలనీ ప్రభుత్వ విధానాలనీ బహిరంగంగా విమర్శించడం అనేది ఎంతవరకూ కరెక్టో ఆలోచించుకోవాలని ఐవైఆర్ ను ఉద్దేశించి పరకాల చెప్పారు. ఐవైఆర్ పదవి తొలగింపు విషయంలో ప్రభుత్వం చూపుతున్న కారణం ఏంటంటే.. వివిధ వర్గాల నుంచీ ఆయనపై ఫిర్యాదులు వచ్చాయనీ, వాటిపై స్పందిస్తూ నిర్ణయం తీసుకున్నారని!
అయితే, ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ సర్కారుకు సంబంధించి బయటపెట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయంటూ ఐవైఆర్ మీడియాతో చెప్పారు. ప్రభుత్వానికి పొలిటికల్ మైలేజ్ తగ్గించే విధంగా తాను వ్యవహరించలేదనీ, తన కంటే చంద్రబాబు సర్కారుకు మరింత మైలేజ్ ఇవ్వగలిగినవారు వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. కమ్యూనిటీ మొత్తాన్ని తీసుకెళ్లి టీడీపీకి అంకితం చేశావయ్యా అంటూ తనను చాలామంది అనేవారని కృష్ణారావు చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడాల్సింది చాలానే ఉందనీ, కొన్ని అంశాలను రాద్దామని కూడా నిర్ణయించుకున్నానని ఆయన చెప్పడం ఆసక్తికరం. కొంత గ్యాప్ తరువాత ఆ విషయాల జోలికి వెళ్తానని అన్నారు.
పదవిలో ఉంటూనే ప్రభుత్వం తీరుపై తన అభిప్రాయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పిన కృష్ణారావు… ఇప్పుడు రాజధాని అమరావతి గురించి ఏం చెబుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆ మధ్య ఓ సినిమా విషయంలో పన్ను మినహాయింపుపైనా.. జేసీ వివాదం నేపథ్యంలో టీడీపీ కార్యకర్తల వ్యవహార శైలిపైనా… సోషల్ మీడియాలో పొలిటికల్ సెటైర్లపై చంద్రబాబు సర్కారుకు స్పందించి చర్యలకు దిగిన సందర్భంలో.. ఇలా చాలా అంశాలపై ఐవైఆర్ నిష్కర్షగా స్పందించారు. కాస్త గ్యాప్ తీసుకుని రాజధాని అమరావతితో పాటు మరిన్ని విషయాలను చెబుతానంటున్నారు. ఆయన్ని పదవి నుంచి తొలగిస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రతిపక్షాలకి కొత్త అస్త్రం అవుతుందేమో..!