ఎన్డీయే తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ పేరును భారతీయ జనతా పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల మద్దతునూ కూడగట్టే ప్రయత్నంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఇప్పటికే ఎన్డీయేకు బేషరతు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, క్రమంలో ఏపీ విపక్షం వైకాపా కూడా మద్దతు ప్రకటించింది. గతంలో ప్రధాని మోడీని జగన్ కలిసినప్పుడే… రాష్ట్రపతి అభ్యర్థికి తమ పార్టీ మద్దతు ఎన్డీయే అభ్యర్థికే అంటూ జగన్ చెప్పేశారు. ఇప్పుడు రామ్ నాథ్ పేరును భాజపా ప్రకటించాగానే మరోసారి తన మద్దతును జగన్ ప్రకటించారు. అయితే, ఇప్పుడు చర్చనీయంగా మారుతున్న అంశం ఏంటంటే… రామ్ నాథ్ పేరు ప్రకటించగానే వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి హుటాహుటిన పాట్నాకి వెళ్లడం!
పాట్నా వెళ్లి, రామ్ నాథ్ ను కలుసుకుని, మా మద్దతు మీకే అని స్వయంగా చెప్పారట విజయసాయి. ఇప్పటికిప్పుడు కాబోయే రాష్ట్రపతిని వైకాపా ఎంపీ ఆఘమేఘాల మీద వ్యక్తిగతంగా కలిసి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అనేదే చర్చనీయాంశంగా మారింది. కాబోయే రాష్ట్రపతిని ఇప్పట్నుంచే కాకాపట్టేందుకు జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, అసలు విషయం ఇంకా ఉంది! ఈ మధ్య రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్నారంటూ కొంతమంది ప్రముఖుల పేర్లు తెర మీదికి వచ్చాయి కదా! వారందరినీ విజయసాయి రెడ్డి కలుసుకున్నారట! ఎల్.కె. అద్వానీ, సుష్మా సర్వాజ్, ద్రౌపతీ మర్ము.. ఇలా ప్రచారంలో ఉన్న ప్రముఖులందరి దగ్గరకీ విజయ సాయి వెళ్లారనీ, తమ పార్టీ మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారనీ అంటున్నారు!
ప్రచారంలో ఉన్న ప్రతీ నాయకుడికీ వైకాపా స్టాండ్ ఇదే అంటూ విజయసాయి వివరించి వచ్చారట! రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఎన్డీయేకు మద్దతు ప్రకటించడంపై వైకాపా ఎందుకింత అత్యుత్సాహం ప్రదర్శించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి, ఆ మధ్య ప్రధానితో జగన్ భేటీ అయిన తరువాత చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. కేసులను మాఫీ చేయించుకునేందుకే ప్రధాని కాళ్లు పట్టుకుంటున్నారంటూ టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి అభ్యర్థులతో ముందే భేటీ కావాల్సిన అవసరం వైకాపాకి ఏమొచ్చింది అనే ప్రశ్న వినిపిస్తోంది. ఏ వ్యూహం లేకుండా కేవలం తమ మద్దతను ప్రకటించడం కోసమైతే విజయసాయి వెళ్లుండరు కదా! మరి, ఈ భేటీల గురించి వైకాపా ఎలా స్పందిస్తుందో.. ఏ విధంగా సమర్థించుకుంటుందో చూడాలి.