బావా నువ్వు సూపరే అని శీర్షిక నిచ్చింది ఆంధ్రజ్యోతి ఖమ్మం జిల్లాలో ఒక అధికార కార్యక్రమంలో కెటిఆర్ హరీష్‌ల పరస్పర పొగడ్తల పర్వానికి. రాష్ట్రం ఇంకా కుదురుకోకముందే భారీగా పెట్టుబడులు తేవడంలో కెటిఆర్ కృషి చాలా గొప్పగా వుందని హరీష్ పొగిడేశారు. ఇక హరీష్ నిద్రాహారాలు మాని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని ఆయన తన వంతు పొగడ్తలు గుప్పించారు. కుటుంబంలో ఏదో అవగాహన పెరిగిందని హరీష్ ఇకపై కెసిఆర్‌నే గాక కుమారుణ్ని కూడా పొగిడేస్తుంటారని ఇటీవల చాలా సార్లు అర్థమవుతున్నది. మరోవైపున గొర్రెల పంపిణీ సందర్భంలో కెసిఆర్ మేనల్లుడు హరీష్‌పై పొగడ్తలు గుప్పించేశారు. అద్భుతంగా పనిచేసి నీటిపారుదల పనులు పూర్తి చేయిస్తున్నారని ఆకాశానికెత్తారు. వాస్తవం ఏమంటే నీటి పారుదల సమీక్షలు ఆదేశాలు చాలా వరకూ కెసిఆర్ పేరుమీదే చలామణిలోకి వస్తుంటాయి.అక్కడ అధికారులతో పాటు హరీష్ కూడా కూచుని వుంటారు. అసంతృప్తి వ్యక్తం చేశారు ఆగ్రహించారు ఆదేశించారు వంటివన్నీ ముఖ్యమంత్రి పేరుతోనే వచ్చేస్తాయి. నిజానికి తమ నాయకుడి పనిలో ఏవో లోపాలు వెతికి ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయని హరీష్ అనుయాయులు అంటుంటారు కూడా. ఆయన వ్యతిరేకులు మరో విధమైన కథ చెబుతుంటారు. ఆయన కూడా ప్రాజెక్టుల దగ్గర నిద్ర అంటూ వెళ్లి వస్తుంటారు. నిజంగా ప్రధానమైన డిజైన్ల మార్పు, లావాదేవీలు ఆయనకు ముందే తెలుసా తర్వాత తెలుసుకోవలసిందేనా అన్నది కూడా సందేహం కలుగుతుంటుంది. ఎందుకంటే టిఆర్ఎస్ అధికార వ్యవస్థలో తృతీయ స్థానం ఆయన అనివార్యంగా ఒప్పేసుకున్నారు. ఆ తర్వాత పొగడ్తలు పెరగడంలో ఆశ్చర్యం ఏముంటుంది?