గత మాసం రోజులుగా అనేక పరిణామాలు పాలక తెలుగుదేశంను ఇరకాటంలో పెట్దేవిగా వుండటం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే అనుకూలంగా గొప్పగా చెప్పదగింది ఈ కాలంలో జరిగింది లేదు, నంద్యాలలో శిల్పా మోహనరెడ్డి నిష్క్రమణ రాయలసీమలో సామాజిక సమీకరణాలను మారుస్తున్నది. విశాఖ విమానాశ్రయంలో ఎంపి జెసి దివాకరరెడ్డి దురుసు తనం పెద్ద తలనొప్పిగా మారింది.ఆయన మేనల్లుడైన ఎంఎల్సి దీపక్ రెడ్డి హైదరాబాద్ భూకుంభకోణంలో అరెస్టు కావడం, సస్పెండ్ చేయడం మరింత తీవ్రమైన దెబ్బ. అదే సమయంలో విశాఖ భూ కుంభకోణం మంత్రుల మధ్య తగాదాగా మారింది. సిట్ వేయాల్సి వచ్చింది. ఇంతలోనే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు తొలగింపు ఉదంతం వివాదగ్రస్తమైంది. ఇదే తరుణంలో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోసారి తన ఆందోళనను పునరావృతం చేస్తున్నారు. ఇలా మూడు సామాజిక వర్గాలకు సంబంధించిన టిడిపి వ్యూహం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోగా అడ్డం తిరుగుతున్నట్టు తేలిపోతుంది.వీటిని సర్దుబాటు చేసేందుకు మరెవరూ లేకపోవడంతో ప్రతిదీ ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయన సమయంలో అధికభాగం ఈ పంచాయితీలను సర్దుబాటు చేయడానికే సరిపోతున్నా పార్టీలో అంతర్గత వ్యవహారాలు కూడా అదుపులో వుండటం లేదు. ఆఖరుకు ప్రకాశం జిల్లాలే పార్టీ గ్రూపులు హత్యల వరకూ వెళ్లిన తీరు పరువునష్టమే మిగిల్చడంతో పాటు విశ్వసనీయతకు విఘాతంగా మారింది.