తనదాకా వస్తేగానీ తగువు తెలీదని వెనకటికో సామెత. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు ఇప్పుడే ఇదే బోధపడుతున్నట్టుగా ఉందని చెప్పాలి. సోషల్ మీడియాలో ప్రభుత్వంపైనే అభ్యంతరక పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుపై ఏపీ సర్కారు వేటు వేసిన సంగతి తెలిసిందే. కార్పొరేషన్ పదవి నుంచి ఆయన్ని తొలగిస్తూ ఉత్వర్వులు జారీ అయ్యాయి. ఆ తరువాత, ఐవైఆర్ కూడా వెనక్కి తగ్గకుండా… చంద్రబాబు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యలు వస్తే వాటిని పాజిటివ్ గా తీసుకోవాలనీ, ఇలాంటి సెటైర్లపై చేతనైతే సమాధానం ఇవ్వాలీ.. లేదంటూ కామ్ గా ఉండిపోవాలంటూ చంద్రబాబు సర్కారుకు ఆయన సూచించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య జరిగిన రవికిరణ్ అరెస్టు విషయంలో కూడా తాను తట్టుకోలేకపోయాననీ అన్నారు. అయితే… ఇప్పుడు అదే తరహాలో సెటైర్లు ఆయన మీద పడుతుంటే తట్టుకోలేకపోతున్నారు..!
ప్రస్తుతం ఐవైఆర్ కృష్ణారావుపై కూడా సోషల్ మీడియాలో సెటైర్లు పడిపోతున్నాయి! దీంతో ఆయన హర్ట్ అయ్యారు. సోషల్ మీడియా వ్యాఖ్యానాలపై ఎలా స్పందించాలో చంద్రబాబుకు ఉద్భోధించిన ఆయనే… 24 గంటలు గడవక ముందే గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు! ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసేందుకు కృష్ణారావు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఆయన గవర్నర్ తో భేటీ అయి, కొన్ని అంశాలు ఆయన ముందుంచినట్టు తెలుస్తోంది.
ఇంతకీ ఆయన గవర్నర్ కు చేసిన ఫిర్యాదు ఏంటంటే… తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో కొంతమంది పోస్టులు పెడుతున్నారనీ, ఉద్దేశపూర్వకంగానే తనను అవమానించే ప్రయత్నం జరుగుతోందనీ, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కృష్ణారావు విజ్ఞప్తి చేశారట! కొంతమంది ప్రోద్బలంతోనే ఇది మొదలైందనీ, వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు ఆయన ఫిర్యాదు చేశారు. రొటీన్ గా అయితే.. ఏ ఫిర్యాదులపైన అయినా గవర్నర్ స్పందన పెద్దగా ఉండదు. ఎవరొచ్చినా, ఎవరిపై ఏ ఫిర్యాదులు చెప్పినా, వారు చెప్పింది వినడమే గవర్నర్ చేస్తుంటారు. కానీ, కృష్ణారావు విషయంలో నరసింహన్ స్పందన వేరుగా ఉందని కథనం!
ఈ తరహా పోస్టులు పెడుతున్నవారు డ్రైనేజీ స్థాయి వ్యక్తులనీ, ఇలాంటి అంశాలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని కృష్ణారావుతో గవర్నర్ అభిప్రాయపడ్డారట! ఇలాంటి వారి గురించి అవసరంగా ఆలోచిస్తూ తమ స్థాయిని తగ్గించుకోవద్దని నరసింహన్ ఉద్బోధించారట. ఈ పోస్టులు పెడుతున్నవారి గురించి పట్టించుకుంటే, వారి స్థాయిని పెంచినట్టు అవుతుందని చెప్పినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అంటే, కృష్ణారావు ఫిర్యాదును గవర్నర్ నరసింహన్ చాలా లైట్ గా తీసుకున్నట్టుగానే ఉంది. అంతేకాదు, ఇక్కడితో ఈ ఇష్యూని వదిలెయ్యండని కృష్ణారావుకు చెప్పకనే చెప్పినట్టు కదా! గవర్నర్ తో భేటీ అనంతరం కృష్ణారావు ఏదైనా మాట్లాడుతారేమో అని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన కూడా మీడియాని పట్టించుకోకుండా వెళ్లిపోయారట. తన ఫిర్యాదుపై గవర్నర్ స్పందించిన తీరుపై కూడా కృష్ణారావుకి అసంతృప్తి కలిగిందంటారా..?