తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలంటూ నాయకులు కంకణం కట్టుకున్నారు. ఆ మధ్య పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి వచ్చి, తెరాస పతనం ప్రారంభమైందనీ, రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలపగలిగే సత్తా ఒక్క భాజపాకి మాత్రమే ఉందనీ, అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ భాజపాకి పట్టం కడతారంటూ చెప్పి వెళ్లారు. అంతేకాదు, కేంద్రం నుంచి రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులు వస్తున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ సరిగా వినియోగించడం లేదని కూడా ఆరోపించారు. కేంద్రం నుంచి రూ. లక్ష కోట్ల సాయం వచ్చిందన్నారు. ఆ తరువాత, తెరాస నేతలు కూడా భాజపా నేతలకు లెక్కలు చెప్పే ప్రయత్నం చేశారు. కొన్నాళ్లపాటు మాటకు మాట అన్నట్టుగా తెరాస, భాజపాల మధ్య వాగ్యుద్ధం నడిచింది. అయితే, ఇప్పుడు మియాపూర్ కుంభకోణం విషయంలో టి. భాజపా నేతలు జోక్యం చేసుకోరేం..? ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్ సర్కారుపై విమర్శలు చెయ్యలేదేం..? మియాపూర్ భూ కుంభకోణాన్ని కాంగ్రెస్, టీడీపీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పోరాటం చేస్తుంటే, భాజపా మాత్రం ఏం ఎరగనట్టు సైలెంట్ గా ఎందుకు ఉంటోంది..?
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్ర భాజపా నేతలకు కేంద్రం నుంచి కొన్ని సంకేతాలు వచ్చాయట! రాష్ట్రపతి ఎన్నికలు జరిగేంత వరకూ మియాపూర్ భూ కుంభకోణం గురించి ఎవ్వరూ ఎక్కడా ఏమీ మాట్లాడొద్దని వారికి హైకమాండ్ ఆదేశించినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరేందుకు కొంతమంది భాజపా నేతలు ఢిల్లీకి పయనమౌతుంటే… ఆ టాపిక్ తో తమ వద్దకు రావొద్దని జాతీయ పార్టీ నేతల నుంచి కబురొచ్చిందట! దాంతో పర్యటన విరమించుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, రాష్ట్రంలో కూడా కొంతమంది భాజపా నేతలు ఓ ప్రెస్ మీట్ పెట్టి భూకుంభకోణం విషయంలో కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న తీరును కడిగేద్దామని కాస్త ఆవేశపడ్డారట! ప్రెస్ మీట్ కు ఏర్పాట్లు కూడా జరుగుతున్న తరుణంలో.. సదరు నేతలకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందట. అంతే.. అక్కడితో ఆ టాపిక్ ను వదిలేయాల్సిన ఒత్తిడి వచ్చింది సమాచారం!
కేసీఆర్ పై రాష్ట్ర భాజపా నేతలు గుర్రుగా ఉన్నా… కేంద్రం నుంచి వచ్చిన సలహాలూ సంకేతాల మేరకే చల్లబడాల్సి వచ్చిందని విశ్లేషకుల అభిప్రాయం. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిని ప్రకటించిన వెంటనే తెరాస మద్దతు ప్రకటించింది. అంతేకాదు, నామినేషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. గతంలో ప్రధానిని కలిసిన సందర్భంలో కూడా దళిత అభ్యర్థిని రాష్ట్రపతి చేయాలని కేసీఆర్ సలహా ఇచ్చారనీ తెరాస నేతలు చెప్పుకుంటున్నారు! ఓవరాల్ గా తెరాసపై భాజపా వైఖరి ప్రస్తుతానికి మారింది! అది కేవలం రాష్ట్రపతి ఎన్నికలు దాటే వరకే అనుకోవాలి. ఆ తరువాత, మియాపూర్ కుంభకోణం గురించి లొల్లి చేస్తారేమో! అంటే, అవసరం ఉంటే ఒకలా… అవసరం లేకపోతే మరోలా అధికార పార్టీలే వ్యవహరిస్తే.. ఇలాంటి కుంభకోణాలపై వారికున్న చిత్తశుద్ధి ఏపాటిదో అని చర్చించుకోవడం వ్యర్థం! రాష్ట్రపతి ఎన్నిక తరువాత మియాపూర్ అంశం భాజపాకి అవసరమౌతుందేమో! అప్పుడు మాట్లాడతారేమో..!