మియాపూర్ భూ కుంభకోణాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. మతలబులు జరిగాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రాంతానికి కాంగ్రెస్ నేతలు వెళ్లడం, అక్కడి భూములూ రికార్డులూ డాక్యుమెంట్లూ పరిశీలించడం, గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వడమూ జరిగింది! అంతేకాదు, ఇదే విషయమై ఢిల్లీకి వెళ్లి, అక్కడ పెద్దల్ని కలిసి పోరాటం తీవ్రతరం చేయాలని అనుకున్నారు. అయితే, ఈ ఉత్సాహమంతా కేవలం ఆరంభ శూరత్వమేనా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మియాపూర్ అంశమై కేసీఆర్ సర్కారుపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటంలో వేడి తగ్గిందనీ, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రదర్శించినంత దూకుడు కనిపించడం లేదనీ అంటున్నారు. టి. కాంగ్రెస్ నేతల వైఖరిలో మార్పునకు ఒక బలమైన కారణం కూడా ఉందనే చర్చ మొదలైంది.
ఈ కుంభకోణానికి సంబంధించిన సమాచారమంతా ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకి చేరిందని కథనాలు వచ్చాయి. ఈ వ్యవహారంతో కొంతమంది కాంగ్రెస్ నేతలకు సంబంధాలున్నాయనీ, ముఖ్యమంత్రికి సన్నిహితుడు అని ముద్రపడ్డ ఓ ప్రముఖ కాంగ్రెస్ నేత కుటుంబ సభ్యులతోపాటు, ఇంకొందరి వివరాల ఫైల్ కేసీఆర్ కు చేరింది! ఈ విషయాన్ని ఎక్కడా నిర్ధరించకపోయినా కాంగ్రెస్ నేతలకు గుబులు పుట్టే విధంగా చిన్నచిన్న లీకులు ఇచ్చి తెరాస వదిలేసింది! మంత్రి హరీష్ రావు కూడా ఇదే బేస్ మీద కాంగ్రెస్ నేతలకు పరోక్షంగా హెచ్చరికలు కూడా చేశారు కదా! అన్ని వివరాలూ తమ దగ్గరున్నాయనీ, కాంగ్రెస్ నేతల భూభాగోతాలు బయటపెడతామని అన్నారు. ఈ వ్యవహరంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఉండటం, ఆయనకీ అధిష్ఠానంలోని కొంతమంది పెద్ద మనుషులకీ సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలున్నాయి.
సో.. ఈ వ్యవహారాన్ని మరింత కెలుక్కుంటే కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పిగా మారుతుందని కొంతమంది అనుమానిస్తున్నారు. ఈ లెక్కలన్నీ వేసుకున్నాకనే టి. కాంగ్రెస్ దూకుడు తగ్గించుకుందనే విమర్శలు మొదలయ్యాయి. ఈ విమర్శపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పందించడం విశేషం! మియాపూర్ విషయమై తాము ఎక్కడా తగ్గడం లేదనీ, పోరాటంలో భాగంగా భూములు సందర్శించామనీ, సీబీఐ ఎంక్వయిరీకి డిమాండ్ చేశామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల హడావుడి నడుస్తోందనీ, పార్టీ హై కమాండ్ కూడా అదే పనిలో కాస్త బిజీబిజీగా ఉంటోందన్నారు. అందుకే ఈ వ్యవహారం అక్కడ ప్రస్తుతం ప్రస్థావనకు రాలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో.. ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు కొంత సమయం పడుతుందని చెప్పకనే చెప్తున్నట్టు! అంటే, మంత్రి హరీష్ హెచ్చరికలు బాగానే పనిచేశాయన్నట్టు..!