కర్నూలు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అసహన వ్యాఖ్యలు బెదిరింపులు తీవ్ర విమర్శకు గురైనాయి. అవి స్క్రోలింగ్లో వస్తుండగానే నిరసన కనిపించింది. సోషల్మీడియాలో టిడిపి ప్రయోజనాలు నిరంతరం కాపాడే మిత్రుడు నీలాయపాలెం విజయకుమార్ వెంటనే రంగంలోకి దిగారు. జెమినీ టీవీలో చంద్రబాబు మాటల క్లిప్పింగునూ, టీవీ9 స్క్రోలింగునూ కలిపి ఇది కావాలని చేశారంటూ విమర్శలు గుప్పించారు. మామూలుగా సాక్షికి(కొన్నిసార్లు ఇతరులనూ కూడా) రాజకీయ ఉద్దేశాలు ఆపాదించే టిడిపి నేతలు ఈసారి టీవీ9ను కూడా లక్ష్యంగా చేసుకోవడం నాకు ఆశ్చర్యమనిపించింది. తర్వాత చూస్తే విజయకుమార్ కాస్త సర్దుకుని నాగిరెడ్డి అనే రిపోర్టర్ ఇదంతా చేశాడని మళ్లీ కొత్త పోస్టు పెట్టారు. రిపోర్టర్లు ఎడిటర్లు అనౌన్సర్లు ఎవరని కాదు కదా,, అంటే తొందరపడ్డామని తెలిసి దాడి అటు తిప్పేశారా? విజయకుమార్ పెట్టిన జెమినీ క్లిప్పింగు టీవీ9 రిపోర్టర్ కవర్ చేసిన భాగం ఒకటే అనుకోవలసిన అవసరం ప్రేక్షకులకు వుండదు. పైగా అది నిజంగా తప్పయితే సంబంధిత ఛానల్ అధికారికంగా ప్రకటించాల్సి వుంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఖండన విడుదల చేయాల్సి వుంటుంది. పదాలు ఏమైనా చంద్రబాబు మాటల తీరు అలాగే వుందని అందరూ అంటున్న మాట.
ఇది సవరించుకోవడానికి బదులు టీవీకో రిపోర్టర్కో ఉద్దేశాలు అంటగట్టేస్తే ఉపయోగం ఏమిటి? అన్నట్టు నీలాయపాలెం ఇటీవల బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ఉద్వాసనకు కారణమైన వివాదాన్ని కూడా ప్రారంభించిన సంగతి ఇక్కడ గుర్తు చేయాలి. సోషల్మీడియాలో విమర్శలు భరించలేకపోతున్నా ఉపయోగించుకోవడంలో మాత్రం టిడిపి హుషారుగానే వుందని ఈ ఉదాహరణలు చెబుతున్నాయి.అన్నట్టు విజయకుమార్ తాజాగా మరో పోస్టు పెట్టారు. డిజె దువ్వాడ జగన్నాథం చిత్రంలో ఏదో డైలాగు సరిగా లేదని. ఇది కొత్త వివాదమవుతుందా? ఏమో!