ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలపై దుమారం చాటున కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వాచాలత మరుగునపడిపోయింది. రైతుల రుణమాఫీ ప్యాషన్‌గా మారిందని అన్నారంటే ఎంత బాధ్యతా రహితం అనుకోవాలి? రోజుకు 55 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వార్తలు వస్తుంటే ఎవరైనా చలించిపోతారు. ప్రభుత్వంలో వున్న వారు సిగ్గుపడాలి.వారిని కాపాడేందుకు రుణమాపీ ఒక్కటే చాలదు గాని అది ఫ్యాషన్ అవుతుందా? ఉత్తర ప్రదేశ్‌లో ఆ పార్టీయే వాగ్దానం చేసింది. రైతు ఆత్మహత్యల్లో అగ్రస్థానంలో వున్నది బిజెపి పాలించే మహారాష్ట్ర. ఆందోళనల తర్వాత ఇటీవలనే అక్కడ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడనవీస్ రుణమాఫీ పథకం ప్రకటించారు.మరోవైపున మధ్యప్రదేశ్ మండిపోతున్నది. సరే నాయుడుగారి స్వంత రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సమయంలో తన బహి:ప్రాణంలాటి చంద్రబాబు రుణమాఫీ వాగ్దానం చేశారు. అనేక మెలికలతో అమలు చేశారు. మరి ఆ ప్యాషన్ షోలో వెంకయ్య పాల్గొనలేదా? స్వంత పార్టీ సిఎం ఫడనవీస్ చేసింది తెలియదా? ఇది వరకు కూడా ఒక బిజెపి కేంద్ర మంత్రి ఒకరు రైతులు పురుషత్వం లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నోరు పారేసుకున్నారు. అంతకు ముందు కాలంలో బండారు దత్తాత్రేయ తిన్నదరక్క ఆత్మహత్యలని తూలనాడారు. ఇవన్నీ కూడా బాధ్యతా రాహిత్యాన్నే గాక అమానవీ లక్షణాలనిపిస్తాయి.సరే బడా పారిశ్రామిక వ్యాపార వేత్తలకు వేల కోట్లు కట్టబెట్టొచ్చు గాని రైతులకు కొన్ని వేల కోట్లు మాఫీ చేయకూడదా అన్న ప్రశ్న వుండనే వుంటుంది. సో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది సార్.