ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ మరోసారి కీలకంగా మారేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు! మావోయిస్టు పార్టీ నుంచి ఆయన బయటకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత, సొంతంగానే ప్రజా పోరాటాలు చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టు చెప్పారు. అయితే, ప్రత్యామ్నాయ వేదిక ఇంకా సరిగా సెట్ కావడం లేదు. కొత్తగా ఓ ఉద్యమాన్ని నిర్మించేందుకు గద్దర్ ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లూ తెలంగాణలో సమస్యలూ లేదా తెలుగు రాష్ట్రాల సమస్యలకే పరిమితమౌతూ వచ్చిన గద్దర్.. ఇప్పుడు దక్షిణాది మొత్నాన్ని ప్రభావితం చేసే ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. అయితే, ఆయన ఆశిస్తున్న స్థాయిలో ఈ ఉద్యమ వేదిక సిద్ధమౌతుందా లేదా అనేదే అసలు ప్రశ్న..?
‘దక్షిణాది సాంస్కృతిక సామాజిక రాజకీయ వేదిక’ అంటూ గద్దర్ కొత్త హడావుడి మొదలుపెట్టారు. ఈ ఉద్యమం నిర్మించేందుకు తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖుల వెంట గద్దర్ పడుతున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, తెలుగు ఇండస్ట్రీ నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి పనిచేస్తానని గద్దర్ తాజాగా చెబుతున్నారు. ఈ ఉద్యమ వేదికను బలోపేతం చేసే ప్రయత్నంలో ఇప్పటికే ఆ ఇద్దరు స్టార్స్ కి రాయబారం పంపినట్టు గద్దర్ చెప్పారు. వారి నుంచి త్వరలోనే అంగీకారం వస్తుందని ఆశిస్తున్నా అన్నారు. దక్షిణాది ఆత్మగౌరవ అజెండాతో ఉద్యమాన్ని నిర్మిస్తామని, ఢిల్లీ స్థాయిలో దక్షిణాది వాణిని బలంగా వినిపిస్తామని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక స్థూపానికి ఢిల్లీలో స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వకపోవడం అవమానకరం అని గద్దర్ ఈ సందర్భంగా విమర్శించారు.
సినీ స్టార్స్ ను ఆశ్రయిస్తే ఉద్యమ వేదిక నిర్మాణం ఈజీ అయిపోతుందని గద్దర్ అనుకుంటున్నట్టున్నారు. అయితే, ప్రాక్టికల్ గా ఆలోచిస్తే గద్దర్ పంపిన రాయబారానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి సమాధానం వస్తుందని ఆశించలేం! ఎందుకంటే, ఆయన సొంత పార్టీని ఏర్పాటు చేసే పనుల్లో ఉన్నారు. పైగా, గద్దర్ తో కలిసి పనిచేయాల్సిన అవసరం ఆయనకి లేదనే చెప్పాలి! ఇక, పవన్ కల్యాన్ విషయానికొస్తే.. దక్షిణాది ఆత్మగౌరవం గురించి పవన్ ఎప్పటికప్పడు మాట్లాడుతూ ఉంటారు. ప్రత్యేక హోదా విషయంలోగానీ, ఆ మధ్య టీటీడీ ఈవో నియామక సమయంలోగానీ దక్షిణాదిపై చిన్నచూపు ఉంటోందని ఆక్రోశించారు. ఈ ఒక్క అంశం కామన్ గా ఉంది కాబట్టి, పవన్ మద్దతు వస్తుందని గద్దర్ ఆశిస్తున్నట్టున్నారు! కానీ, ఇంతవరకూ గద్దర్ ఆహ్వానంపై పవన్ స్పందించింది లేదు. ఆ మాట గద్దరే చెబుతున్నారు.
గద్దర్ తో కలిసి పనిచేసేందుకు పవన్ ముందుకొచ్చే అవకాశాలు కూడా తక్కువే అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఒకవేళ దక్షిణాది ఆత్మగౌరవానికి సంబంధించిన ఏదైనా ఇష్యూపై గద్దర్ కార్యక్రమాలు చేపడితే… తన మద్దతు ఉంటుందని ఆ క్షణానికి పవన్ ప్రకటించొచ్చు. అది కూడా ఒక్క ట్వీట్ రూపంలో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు! అంతేగానీ, గద్దర్ నిర్మించాలనుకుంటున్న ఉద్యమ వేదికలో పవన్ భాగస్వామ్యం ఉంటుందని ఇప్పుడున్న పరిస్థితులను బేరీజు వేసుకుని ఆలోచిస్తే కష్టమనే చెప్పాలి. మరి, గద్దర్ ఆశిస్తున్న ఉద్యమ వేదిక నిర్మాణం సాధ్యమా..? మొత్తానికి, గద్దర్ కు సరైన దారి దొరకలేదనే చెప్పుకోవాలి.