తెలంగాణలో తెలుగుదేశం, భాజపాల మరోసారి మాటల యుద్ధానికి తెర లేచేలా ఉంది. భాజపాతో పొత్తు కొనసాగించేందుకు టీ టీడీపీ నేతలు ఏమంత ఇష్టంగా లేరన్న సంగతి తెలిసిందే. అయితే, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రం ఈ విషయంపై ఎటూ తేల్చడం లేదు. తెలంగాణలో తమను భాజపా తక్కువ చేసి చూస్తోందనీ, పొత్తుపై ఏదో ఒకటి తేల్చెయ్యాలని గతంలో చాలాసార్లు చంద్రబాబు ముందు తమ వాదనను వినిపించారు టీ టీడీపీ నేతలు. అయితే, కొన్నాళ్లు వెయిట్ చెయ్యండీ అంటూ చంద్రబాబు టైం పాస్ చేసుకుంటూ వస్తున్నారు. భాజపాపై విమర్శలు వద్దని కూడా తెలంగాణ నేతలకి చెబుతూ వచ్చారు. అయితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి మరోసారి భాజపా తీరుపై విమర్శలకు దిగారు.
దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జీఎస్టీ అమలు కార్యక్రమాన్ని భాజపా చేపడుతుంటే.. దాన్ని బహిష్కరించాలంటూ తెరాస సర్కారుకు రేవంత్ సలహా ఇవ్వడం ఆసక్తికరంగా ఉంది. జీఎస్టీ వస్తే ఇబ్బందులు తప్పవంటూ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ చెబుతున్నవి వాస్తవాలే అని రేవంత్ సమర్థించారు. జీఎస్టీ వస్తే రైతులపై భారం పెరుగుతుందనీ, విత్తనాలూ ఎరువుల ధరలు పెరుగుతాయనీ, ఓవరాల్ గా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం తప్పదని రేవంత్ అన్నారు. జీఎస్టీ వల్ల పడుతున్న అదనపు భారాన్ని కేంద్రం భరించేలా ఒత్తిడి చేయాలంటూ తెరాసకు ఆయన సూచించారు. పెద్ద నోట్ల రద్దు విషయంలోనూ ఇలానే తొందరపడి కేంద్రానికి తెరాస మద్దతు ప్రకటించిందనీ, నగదు కోసం ఇప్పటికీ ప్రజలూ రైతులూ అవస్థలు పడుతున్నారని రేవంత్ అభిప్రాయపడ్డారు. జీఎస్టీ ప్రారంభ కార్యక్రమాన్ని బహిష్కరించాలని రేవంత్ పునరుద్ఘాటించారు.
భారతదేశ చరిత్రలోనే జీఎస్టీ ఒక గొప్ప నిర్ణయం అని భాజపా సర్కారు చెబుతూ ఉంటే… ఆ పార్టీతో పొత్తులో ఉన్న టీడీపీ నేత రేవంత్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ, ఇది రేవంత్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయామా.. లేదా, జీఎస్టీపై తెలుగుదేశం పార్టీ స్టాండ్ కూడా ఇదేనా..? జీఎస్టీ ప్రారంభ కార్యక్రమాన్ని బహిష్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సలహా ఇచ్చిన రేవంత్.. ఇదే మాటను ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా చెబుతారా..? అక్కడ కూడా జీఎస్టీ వల్ల రైతులకు భారమౌతుంది కదా. ఆంధ్రా ఆర్థిక వ్యవస్థపై కూడా అదనపు భారం పడుతుంది కదా. రేవంత్ వ్యాఖ్యల వల్ల జీఎస్టీపై ఎలాంటి ప్రభావం ఉన్నా లేకపోయినా… మరోసారి టీడీపీ, భాజపా నేతల మధ్య విమర్శల పర్వానికి తెర లేస్తుందని చెప్పొచ్చు.
భాజపాతో కలిసి పనిచేసే విషయమై చంద్రబాబు ఎటూ తేల్చడం లేదు. మరోపక్క రాష్ట్రపతి ఎన్నికల్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ప్రధాని మోడీకి దగ్గరయ్యేందుకు తెరాస చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఈ నేపథ్యంలో భాజపాతో పొత్తుపై ఏదో ఒకటి తేలాలన్నది రేవంత్ పట్టుదల అన్నట్టు కనిపిస్తోంది. తాజా విమర్శల వెనక వ్యూహం కూడా ఇదేనేమో..!