భారతీయ జనతా పార్టీ తీరు ఏపీ టీడీపీ నేతలకు మరోసారి ప్రశ్నార్థకంగా మారింది! రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వైసీపీ విషయంలో భాజపా అనుసరిస్తున్న విధానాలు టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కు ఏపీలోని టీడీపీతోపాటు, వైసీపీ కూడా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో విడతల వారీగా జరిగే నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమానికి మొదట చంద్రబాబును భాజపా ఆహ్వానించింది. నాలుగో విడత నామినేషన్ కార్యక్రమానికి వైకాపాని కూడా పిలిచిన సంగతి తెలిసిందే! అయితే, ఆహ్వానించడంతో ఆగి ఉంటే తమ్ముళ్లు కాస్త శాంతించేవారేమో..!
నాలుగో సెట్ నామినేషన్ పత్రాలపై రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ ను బలపరుస్తూ వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సంతకం తీసుకున్నారు! ఈ విషయం టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. అంతటితో ఆగకుండా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా మేకపాటితో కలుపుగోలుగా మాట్లాడుకుంటూ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం.. పుండుమీద కారం చల్లినట్టుగా తమ్ముళ్లు సహించలేకపోతున్నారట! ఆ మధ్య, జగన్ కు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడంపై కూడా ఇలానే టీడీపీ నేతల తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మంత్రుల దగ్గర నుంచీ ఎమ్మెల్యేలూ ఎమ్మెల్సీలందరూ భాజపా తీరుపై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. అయితే, ఆ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని, బీజేపీపై ఎవ్వరూ ఎలాంటి విమర్శలూ చెయ్యొద్దని చెప్పడంతో ఆ ఇష్యూకి అప్పటికి ఫుల్ స్టాప్ పడింది. కానీ, ఇప్పుడు మరోసారి టీడీపీ నేతలు ఆగ్రహానికి గురౌతున్నట్టు సమాచారం.
ఏ పార్టీతో కావాలంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే స్వేచ్ఛ భాజపాకి ఉంటుందనీ, కానీ సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లు టైమ్ ఉండగా వైకాపాతో ఇలా ఎలా వ్యవరిస్తారంటూ భాజపా తీరుపై కొంతమంది టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం! రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ పత్రాలు దాఖలు కార్యక్రమానికి వైకాపాని పిలవడంలో తప్పులేదు. కానీ, ఆంధ్రాలో ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ఎంపీతో సంతకం తీసుకోవడం ఏంటనేది వారి ఆగ్రహం. పైగా, చంద్రబాబుకు కొమ్ముకాస్తూ వచ్చే వెంకయ్య నాయుడు కూడా దగ్గరుండి ఇలా చేయించడమేంటని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు సమాచారం.
జగన్ కు ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చిన రోజునే భాజపాని చంద్రబాబు నిలదీసి ఉండి ఉంటే.. ఇవాళ్ల ఇలా జరిగి ఉండేది కాదనీ, వైకాపా ఎంపీతో కలిసి మరీ వెంకయ్య నామినేషన్ పత్రాలు సమర్పణకు వెళ్లారంటే ఇదంతా మోడీ మాస్టర్ ప్లాన్ అయి ఉంటుందనీ ఓ సీనియర్ నేత ఆఫ్ ద రికార్డ్ వాపోతున్నారట. ఈ విషయాన్ని చంద్రబాబు లైట్ గా తీసుకోకూడదనీ… టీడీపీతో పొత్తులో ఉంటూ వైకాపాకి భాజపా ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని నేతలు గుర్రుగా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే, ఈ అసంతృప్త స్వరం చంద్రబాబు వరకూ వెళ్లిందనీ… గతంలో చెప్పినట్టుగానే భాజపాని ఎవ్వరూ ఏమీ అనొద్దన్న రీతిలోనే ఆయన స్పందన ఉందనీ ఓ కథనం ప్రచారంలోకి వస్తోంది.