పట్టిసీమ ఎత్తిపోతల పథకం అందుబాటులోకి రావడం నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులో దూకుడు పెంచుతోంది. ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. రైతుల కళ్ళలో ఆనందం చూడ్డమే లక్ష్యంగా పనిచేస్తున్నానన్న ముఖ్యమంత్రి నిన్న తాజాగా చేసిన ప్రకటన అన్నదాతల్లో ఉత్సాహాన్ని పెంచేది. కృష్ణా డెల్లాకు వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్ పంటకు జూన్ ఒకటో తేదీ నాడే నీటిని విడుదల చేస్తామని ఆయన చేసిన ప్రకటనే దీనికి కారణం. 30 ఏళ్ళుగా ఏప్రభుత్వమూచేయని పని తాను చేస్తున్నానని చెప్పారాయన. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిలో కొంత ఒడిసి పట్టి రైతుల సమగ్రాభివృద్ధికీ, పంటలు నష్టపోకుండా కాపాడడానికీ కృషి చేస్తామన్నారు చంద్రబాబు. జూన్ ఒకటో తేదీ నుంచే నీరివ్వడం వల్ల తుపాన్ల వల్ల పంటలు నష్టపోకుండా కాపాడుకోగలగుతామని ఆయన అంచనా వేస్తున్నారు. ఇదే సాకారమైతే రైతుకు అంతకంటే కావాల్సిందేముంది. ప్రకృతి విపత్తుల నుంచి పంటను కాపాడే చర్యలు చేపడితే అన్నదాతలు ఏ ప్రభుత్వాన్నయినా నెత్తిన పెట్టుకుంటారు.