స్టార్ల తనయులు స్టార్స్ అవ్వాలని చూడడం తప్పు లేదు. ఇంట్లో సినిమా వాతావరణం ఉంటుంది కాబట్టి… అటువైపుకు మనసులాగుతుంటుంది. రాజకీయ నాయకుల తనయుల దృష్టి కూడా సినిమాలవైపే మళ్లుతోంది. ఎందుకంటే సినిమాకి ఉన్న గ్లామర్ అలాంటిది. ఆంధ్ర ప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరో అవ్వాలనే ఓ కల కన్నాడు. అది ‘జయదేవ్’తో సాకారం అయ్యింది. మంత్రిగారి తనయుడి సినిమా అంటే టెక్నికల్ గా టీమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి కదా? అది ఈ సినిమాకి కుదిరింది. తమిళంలో మంచి విజయం సాధించిన సేతుపతి సినిమా కథని కొనుక్కొచ్చారు. స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన జయంత్ సి.పరాన్జీ చేతిలో గంటా రవిని పెట్టారు. మణిశర్మకు సంగీత బాధ్యతలు అప్పగించారు. బ్యాక్ గ్రౌండ్ అంతా ఓకే. మరి… గంటా రవి ఎలా చేశాడు? తొలి సినిమాతో పాస్ మార్కులైనా దక్కించుకొన్నాడా? తెర వెనుక పడిన తాపత్రయం… ఫలితాన్ని ఇచ్చిందా?
* కథ
మస్తాన్ రాజు (వినోద్ కుమార్) అక్రమాలకు, అన్యాయాలకు ప్రతినిధి. తనకు అడ్డు వచ్చిన ఎవ్వరినైనా సరే, హతమారుస్తుంటాడు. ఓ పోలీస్ అధికారి (రవి ప్రకాష్)ని కూడా పొట్టన పెట్టుకొంటాడు. ఈ కేసు… జయదేవ్ (గంటా రవి) దగ్గరకు వస్తుంది. జయదేవ్‌కి కోపం ఎక్కువ. నీతీ నిజాయతీనే ఊపిరిగా భావిస్తుంటాడు. మస్తాన్ కు విరుద్ధంగా సాక్ష్యాల్ని సంపాదిస్తాడు. అయితే సాక్షిని చంపాడన్న నిందతో సస్పెండ్ అవుతాడు. మరోవైపు మస్తాన్ ని ఇరికించడానికి సంపాదించిన సాక్ష్యాలన్నీ నీరుగారిపోతాయి. పోలీస్ డిపార్ట్మెంట్లోనే తనకు శత్రువులు తయారవుతారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్ని జయదేవ్ ఎలా ఎదుర్కొన్నాడు? మస్తాన్‌ని చట్టానికి ఎలా అప్పగించాడు? పోలీస్ అధికారి హత్యకు ఎలాంటి ప్రతికారం తీర్చుకొన్నాడు? అనేదే.. జయదేవ్ కథ.
* విశ్లేషణ
పోలీస్ కథలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. నిజాయతీగల పోలీస్ – అతనికి ఎదురైన ఆటంకాలు.. ఇదే కథ. జయదేవ్ కథ కూడా అంతే. అయినా సరే.. తమిళంలో ‘సేతుపతి’ని రీమేక్ చేయాల్సిన అవసరం వచ్చిందటే… ఆ కథలో ఉన్న ఎమోషన్స్ ఆకర్షించి ఉంటాయ్. కథని కథగా ఎలాంటి మార్పులూ చేర్పులూ లేకుండా మక్కీకి మక్కీ దించేసిన జయంత్… ఎమోషన్స్ విషయంలో తడబడ్డాడు. దాంతో జయదేవ్లో ఫైర్ మిస్సయ్యింది. పోలీస్ ఆఫీసర్.. అతని కోపం, ఆ కోపం నుంచి పుట్టుకొచ్చే పంతం, తనలో తాను పడే ఘర్షణ… ఇదే ‘సేతుపతి’ బలం. అవేం.. జయదేవ్లో కనిపించలేదు. కథ చెబుతున్నంత సేపూ… ‘జయదేవ్’ని కాస్తయినా చూడగలం. అది మినహాయించి రొమాన్స్, కామెడీ మొదలెడితే… నీరసం వచ్చేస్తుంది. ప్రధమార్థంతో పోలిస్తే.. ద్వితీయార్థమే కాస్త బెటర్. కథ ఓ ట్రాక్ పై నడుస్తూ కనిపిస్తుంటుంది. హీరో పాత్రని బలంగా చూపించలేకపోవడం, ప్రతినాయకుడి పాత్రని అరుపులకే పరిమితం చేయడం, కథానాయిక పాత్రని వాడుకోకపోవడం.. ఈ సినిమాలోని ప్రధానమైన లోపాలు. సినిమాని హై పిచ్‌కి తీసుకెళ్తే సన్నివేశాలు ద్వితీయార్థంలో కొన్ని ఉన్నాయి కూడా. ముఖ్యంగా… హీరో ఇంటిని విలన్లు చుట్టిముట్టే సందర్భం. ఆ సీన్ తమిళంలో చూస్తే రోమాలు నిక్కబొడుస్తాయి. దాన్ని కూడా పైపైనే లాగించేశారు. క్లైమాక్స్ ని సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈమాత్రం కథ కోసం ‘సేతుపతి’ని ఎందుకు రీమేక్ చేశారని అడగొచ్చు. అయితే ఆ తప్పు.. సేతుపతిది కాదు, ఆ సినిమాని సరిగా హ్యాండిల్ చేయలేకపోయిన జయంత్.. పరుచూరి బ్రదర్స్‌దే.
* నటీనటుల ప్రతిభ
గంటా రవి హీరోగా ఏం చేశాడో, ఎలా ఉంటాడో అన్న ఆసక్తి కాస్త కలిగింది. గంటా రవి మైనస్సులు జయంత్‌కి ముందే తెలుసు. కాబట్టి… కాస్త జాగ్రత్తగానే డీల్ చేశాడనిపిస్తుంది. రొమాన్స్, కామెడీకి తక్కువ స్పేస్ ఉన్న పాత్ర ఇది. ఎమోషన్స్ కీలకం. ఆ విభాగంలో రవి ఓకే అనిపిస్తాడు. ఇలాంటి సీరియెస్ కథల్ని ఎంచుకొంటే బాగానే ఉంటుంది. తొలి సినిమా కాబట్టి… మైనస్సుల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రవికి పాస్ మార్కులు పడిపోతాయి. అయితే కథానాయిక పాత్ర మరీ దారుణం. హీరోయిన్‌కి తక్కువ.. గెస్ట్ ఎప్పీరియన్స్కి ఎక్కువ అన్నట్టుంది వాలకం. వినోద్ కుమార్ పాత్రలో అరుపులు తప్ప ఇంకేం కనిపించలేదు. ఇంత ఖర్చు పెట్టినవాళ్లు ఆ పాత్రలో మంచి నటుడ్ని, పేరున్న వాళ్లని తీసుకొస్తే బాగుండేది. బిత్తిరి సత్తి అల్లరి భరించలేం. వెన్నెల కిషోర్ ని సరిగా వాడుకోలేదు.
* సాంకేతిక వర్గం
గంటా రవిని ఎలివేట్ చేయడానికి నిర్మాత బాగానే ఖర్చు పెట్టారు. అయితే ఖర్చు తప్ప.. పనితనం కనిపించలేదు. మణిశర్మ పాటల్లో కొత్తదనం కొరవడింది. నేపథ్య సంగీతంలో కూడా ఆయన మార్క్ కనిపించలేదు. పరుచూరి మాటలు.. ఇంకా ఆ కాలంలోనే ఉండిపోయాయి. కొత్తగా పంచ్‌ల కోసం ఒకట్రెండు సందర్భాల్లో ప్రయత్నించారు. జయంత్ దర్శకుడిగా విఫలం అయ్యాడు. సేతుపతి లాంటి సినిమా చేతిలో ఉన్నా… దాన్ని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దలేకపోయాడు. కనీసం కొన్ని సన్నివేశాలైనా ఉత్కంఠ భరితంగా తీర్చిదిద్దగలిగితే… సేతుపతి కథకి కాస్తయినా న్యాయం జరిగేది.
* ఫైనల్ టచ్ : గంట… మోగలేదు!
తెలుగు360.కామ్ రేటింగ్ 1.5/5