సీఆర్డీయే అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజధాని నగరాభివృద్ధి ప్రణాళిక అమలుతోపాటు త్వరలో సింగపూర్ కన్సార్టియం ఆఫ్ కంపెనీస్ తో చేసుకోబోతున్న ఒప్పందాల గురించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయనీ, అలాంటి వాటిని సమర్థంగా తిప్పికొడతాం అన్నారు. 2016 అక్టోబర్ 8 నుంచే కొందరు ఈ కుట్రలు ప్రారంభించారని చెప్పారు. తనపై వ్యక్తిగతంగా ఏదైనా కోపం ఉంటే నేరుగా తీర్చుకోవచ్చనీ, కానీ మధ్యలో రాష్ట్ర ప్రజల్నీ అమాయక రైతులపైనా కక్ష సాధింపులు ఎందుకనీ చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కడివెడు పాలల్లో విషపు చుక్కలు వేసేవారిని ప్రజలు క్షమించరు అని అన్నారు.
రాజధాని ప్రాంత అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధులు రాకుండా అడ్డుకునేలా రైతుల పేరిట దొంగ లేఖలు రాశారంటూ పరోక్షంగా ప్రతిపక్షాన్ని ఉద్దేశించి చంద్రబాబు ఆరోపించారు. 1997లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చే సమయంలో కూడా ఇలానే కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారనీ, కానీ విజయం సాధించి సంస్కరణలు అమలు చేశామన్నారు. రాజధాని విషయంలో జరుగుతున్న కుట్రల్ని న్యాయపరంగా అధిగమించి, ఆంధ్రుల హక్కుగా అమరావతిని నిర్మించి తీరతామన్నారు. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచబ్యాంకు రుణం సాధిస్తామనీ, రాజధాని ప్రాంత అభివృద్ధి పనుల్ని వేగవంతం చేస్తామనీ, రాజధానిని నిర్మించే అవకాశం రావడం తనకు భగవంతుడు ఇచ్చిన వరమని చంద్రబాబు మరోసారి చెప్పారు.
అభివృద్ధిని అడ్డుకునే శక్తుల్ని అణచివేయాల్సిందే. కానీ, అమరావతి గురించి మాట్లాడుతున్న ప్రతీ సందర్భంలోనూ ఈ చర్చే ఎక్కువైపోతోంది. అమరావతిని అడ్డుకునే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తోందనీ, వారిపై పోరాటమనీ ఈ మాటలకే సమయం సరిపోతోంది. ఇవన్నీ సరే.. అమరావతి నిర్మాణంలో పురోగతి ఏదీ..? గడచిన మూడేళ్లలో అమరావతి విషయంలో సాధించింది ఏది..? ఇంకా ఒప్పందాల స్థాయిలోనే రాజధాని నిర్మాణం ఉందంటే… అది ఎప్పటికి పూర్తయ్యేను? డిజైన్ల విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేదనే ఈ మధ్య చెప్పారు. రాజధాని నిర్మాణంపై సమీక్ష అంటే ఇలాంటి అంశాలకు ప్రాధాన్యత ఉండాలి. అంతేగానీ.. ఏదో బహిరంగ సభలో మాట్లాడినట్టుగా, కుట్రలు జరుగుతున్నాయీ, అయినా ఆగేది లేదు, న్యాయపరంగా అణచివేత తప్పదు… ఇలాంటి వ్యాఖ్యానాలు ఎందుకు? అమరావతిలో అభివృద్ధి ఆలస్యం కావడానికి… అణచివేత శక్తులే కారణమని ఇప్పట్నుంచే ఓ కంఫర్టబుల్ సాకును తయారు చేసుకునే విధంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయనే అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వ్యక్తమౌతోంది.