ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కదిలక మొదలైంది! అనుకున్నట్టుగానే ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం ప్రారంభించింది. ఈ మధ్యనే ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు! గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ వైకాపాకి తరలిపోయాయనీ.. ఆ ఓటు బ్యాంకును వెనక్కి రప్పించుకుంటే చాలు అనీ, కాంగ్రెస్ కి రాష్ట్రంలో పునర్వైభవం వచ్చేస్తుందని ఢిల్లీ పెద్దలు సూచించారు. అధికార పార్టీ టీడీపీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేసే బదులు.. ప్రతిపక్ష పార్టీ జగన్ ను లక్ష్యంగా చేసుకుని కార్యాచరణకు దిగాలనీ చర్చించినట్టు కథనాలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఓ బహిరంగ లేఖ రాశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకి ఎలా మద్దతు ఇస్తారంటూ ఆ లేఖలో జగన్ ను రఘువీరా ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా ద్రోహం చేసి, ప్రత్యేక హోదా విషయంలో కూడా మోసం చేసిన భాజపాకి వైకాపా మద్దతు ఏంటంటూ ప్రశ్నించారు. ఎన్డీయే అభ్యర్థి ప్రకటనకు ముందే జగన్ మద్దతు ఎలా ప్రకటిస్తారనీ, ఎన్డీయే అభ్యర్థి ఎవరో, వారి రాజకీయ నేపథ్యం ఏంటో, గుణగణాలేంటో తెలుసుకోకుండా భాజపాకి బేషరతు మద్దతు ప్రకటించడం సరైంది కాదని తప్పుబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ కు చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా విమర్శించారు. ఇక, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వైయస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జగన్ ప్రవర్తిస్తున్నారనీ, రాజకీయ అవకాశవాదిగా మారిపోయారంటూ దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబట్టే ఆంధ్రాలో వైయస్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టగలిగారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్ని పార్టీ తాజా టార్గెట్. వైయస్ హయాంలో సాధించిన విజయాలను కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే విధంగా మలుచుకోవాలేగానీ, వాటిపై జగన్ కు మైలేజ్ ఇవ్వకూడదనేది ఆ మధ్య ఢిల్లీలో ఫిక్స్ అయిన వ్యూహం! దాన్నే ఇప్పుడు రఘువీరా అమల్లోకి తెచ్చారని చెప్పాలి. వైయస్ వేరు, జగన్ రాజకీయం వేరు అనే కాన్సెప్ట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంలో ఈ బహిరంగ లేఖ తొలి అస్త్రంగా చెప్పుకోవచ్చు.
నిజానికి.. ప్రత్యేక హోదా ఇవ్వని భాజపాకి, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వొద్దని తెలుగుదేశం పార్టీని కూడా కాంగ్రెస్ డిమాండ్ చెయ్యొచ్చు. ఎన్డీయే అభ్యర్థి మద్దతుకీ ఏపీ ప్రయోజనాలకీ లింక్ పెట్టి ఉంటే బాగుండేది కూడా ప్రశ్నించొచ్చు. కానీ, ఈ విషయంలో జగన్ మాత్రమే కాంగ్రెస్ ప్రశ్నిస్తుండటాన్ని అర్థం చేసుకోవచ్చు..!