రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మీరాకుమార్ సోమవారం నాడు హైదరాబాద్ కి వస్తున్నారు. గాంధీ భవన్ లో ఆమె కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతారు. అనంతరం మీడియా సమావేశం ఉంటుంది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ ఆమెకి మద్దతు ఇవ్వాలంటూ ముక్తకంఠంతో చెబుతారు! టి. కాంగ్రెస్ నాయకులంతా కలిసికట్టుగా మీడియా ముందు ఫోజులు ఇస్తారు. జరగబోతున్నది ఇదే..! మొన్నటికి మొన్న టి. కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ఇదే సీన్ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా మీరా కుమార్ పేరు ప్రకటించగానే ఆమెని అభినందించడానికి రాష్ట్ర నేతలు ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతి అభ్యర్థిని అభినందించి వచ్చేశారు. అయితే, ఈ సందర్భంగా టి. నేతలు విడివిడిగా అధిష్ఠానం దగ్గర చేసిన ఫిర్యాదుల విషయం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది.
తెలంగాణ పీసీసీ, సీఎల్పీ నేతలు విడివిడిగా అధిష్టాన పెద్దలతో ఢిల్లీలో సమావేశయ్యారట! అయితే, ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడానికే సమయం సరిపోయిందనీ… ఇంకొకరిపై పితూరీలు చెప్పడం ద్వారా అధిష్ఠానం మెప్పుపొందేలా కొంతమంది ప్రవర్తించాలంటూ ఓ సీనియర్ నేత ఆఫ్ ద రికార్డ్ వాపోవడంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది! కేసీఆర్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టడంలో పార్టీపరంగా పీసీసీ పూర్తిగా విఫలమైందనీ, పీసీసీ చేస్తున్న పోరాటాలు వ్యూహాత్మకంగా ఉండటం లేదంటూ సీఎల్పీ సభ్యులు అధినేత్రితో ఫిర్యాదు చేశారట! వారు ఇలా చెబితే.. వీరు తగ్గుతారా..! అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో సీఎల్పీ విఫలమైందనీ, పార్టీలో చర్చించకుండా, ముందస్తు వ్యూహాలేవీ సిద్ధం చేసుకోకుండా విఫలమౌతున్నారనీ పీసీసీ వారు కంప్లయింట్ చేశారట! రైతుల సమస్యలు, ప్రాజెక్టుల్లో అవినీతి, మియాపూర్ భూ కుంభణం వంటి అంశాల్లో వారి పోరాటం బాలేదని వీరు.. వీరి పోరాటంలో వ్యూహం లేదని వారు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారని సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు అలానే ఉందని మరోసారి నిరూపితం అయిందని పార్టీలో కొంతమంది నేతలు వాపోతున్నారు! నిజానికి, గతంతో పోల్చితే తెలంగాణలో కాంగ్రెస్ కాస్త బలపడిందని ఈ మధ్యనే కొన్ని సర్వేలు చెప్పాయి. తెరాస తరువాత రాష్ట్రంలో అత్యధిక ఆదరణ పొందుతున్న పార్టీగా కాంగ్రెస్ ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇలాంటి సమయంలో నేతలంతా కలసికట్టుగా ఉండాల్సింది పోయి… ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడమేంటీ అంటూ పార్టీ వర్గాల్లో కొంతమంది తప్పుబడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని పంచాయితీలు పెట్టుకున్నా ఫర్వాలేదుగానీ, ఇప్పట్నుంచే ఇలా వ్యవహరిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ వర్గాల్లోనే అభిప్రాయం వినిపిస్తోంది! ఆ మధ్య రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చాక.. ఆధిపత్య పోరు కాస్త తగ్గిందనీ, అధికారమే ధ్యేయంగా అందరూ పోరాడతారనే వాతావరణం కనిపించింది. ఆ మార్పు తాత్కాలికమే అన్నమాట! ఇప్పుడు అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.