బాహుబలి లాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలో హీరోయిన్ అంటే ఎలా వుండాలి.?! ఎంత జోరు కనబరచాలి. కాని దేవసేన అనుష్క పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా వుంది. ఇప్పుడు అసలు సినిమా మూడ్ లో కనిపించడం లేదు అనుష్క. ఆమె చేతిలో వున్న ఒక్క గాని ఒక్క సినిమా భాగమతి. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి ఏడాదికి దాటిపోయింది. అప్పటి నుండి ఈ సినిమా అజాపాజా లేదు. ఈ సినిమా అప్ డేట్స్ ఇచ్చే నాధుడే లేడు. కనీసం సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ కూడా బయటకురాలేదు.
మొన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని యూనిట్ నుండి ఒక వార్త బయటికి వచ్చింది. ప్చ్.. లుక్ బయటికిరాలేదు. దర్శకుడు ఇచ్చిన లుక్ నిర్మాతలకు నచ్చలేదని అందుకే లుక్ బయటికిరాలేదని మళ్ళీ ఓ కొత్త గాసిప్. ఈ గాసిప్ పై కూడా క్లారిటీ ఇచ్చే వారే లేరు.
మొదటి నుండి ఈ సినిమా సంగతులు ఇలానే వుంది. ఈ సినిమాపై చాలా నెగిటివ్ ప్రచారాలు జరిగాయి. ఈ సినిమా క్లైమాక్స్ నిర్మాతలకు నచ్చలేదని, దర్శకుడు అశోక్ కాకుండా వేరే దర్శకుడితో ఈ చిత్రం క్లైమాక్స్ ను షూట్ చేశారని.. ఇలా బోలెడు నెగిటివ్ ప్రచారాలు. అయితే వీటిపై కూడా యూనిట్ నుండి క్లారిటీ రాలేదు.
ఇది చిన్న చితకా సినిమా.. అంటే కాదు. యూవీ క్రియేషన్స్ నిర్మాణం. కేవలం అనుష్క క్రేజు ను నమ్మే కోట్లు ఖర్చు చేశారు. మరి సమస్య ఏమిటో ఈ సినిమా నుండి ఎలాంటి అవుట్ పుట్ రావడం లేదు. బాహుబలి తర్వాత అనుష్క నుండి వస్తున్న సినిమా అంటే బోలెడు క్రేజు ఉటుంది. కానీ ఆ వేడిని చల్లార్చేస్తుంది భాగమతి.