ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తాజాగా ప్రతిపక్ష నేత జగన్ కు ఓ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపా అభ్యర్థికి మద్దతు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఇదే సందర్భంలోనే వైయస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జగన్ ప్రవర్తన ఉంటోందనీ, రాజకీయ అవకాశవాదిగా జగన్ మారుతున్నారంటూ ఆరోపించారు. ఆంధ్రాలో కాంగ్రెస్ కు పోయిన ప్రాభవాన్ని మళ్లీ దక్కించుకోవాలంటే వైకాపానే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయాలన్నది కాంగ్రెస్ నేతల వ్యూహం. ఈ క్రమంలో వైయస్ హయాంలో సాధించిన విజయాలన్నీ కాంగ్రెస్ ఘనత ప్రచారం చేసుకోవాలని వారు చూస్తున్నారు. ఈ వ్యూహంపై వైకాపా కూడా ధీటుగానే స్పందించడం మొదలుపెట్టింది. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన వాదోపవాదాలు ప్రారంభం అయ్యాయి!
నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టే, వైయస్సార్ వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టగలిగారన్నది ఆ పార్టీ నేతల వాదన. దీన్ని తిప్పి కొట్టేందుకు వైకాపా ఎంచుకున్న వాదన ఏంటంటే… వైయస్సార్ ఘనతను సమూలంగా తుడిచి వెయ్యడం కోసం కాంగ్రెస్ మొదట్నుంచీ ప్రయత్నిస్తోందంటూ ఆ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీని ఈజిప్టు మమ్మీతో పోల్చారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ మరణించి చాలా కాలమైందని ఎద్దేవా చేశారు. మరణించినా కూడా ఇంకా బతికున్నామనే ఆశ ఆ పార్టీ నేతల్లో ఉందనీ, అప్పుడప్పుడూ కళ్లు తెరిచి, తమ ఉనికిని కూడా చూడండి అంటూ దీనంగా ప్రజలవైపు చూస్తుంటారన్నారు. వైకాపా అధినేత జగన్ కు రఘువీరా రెడ్డి రాసిన లేఖ తీరు అచ్చం ఇలానే ఉందంటూ విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి ప్రాభవాన్ని, ప్రాబల్యాన్ని, ఔన్నత్యాన్ని సమూలంగా అణచివేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత ఎన్ని రకాలైన నీచ చేష్టలు చెయ్యాలో అన్నీ చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అంటూ ఎద్దేవా చేశారు.
వైయస్ మరణం తరువాత ఆయనకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసిందనీ, ఆయన ఔన్నత్యానికి ద్రోహం చేస్తోందన్న భావజాలంతో కాంగ్రెస్ వ్యూహాన్ని ఎదుర్కోవాలన్నది వైకాపా ప్రయత్నిస్తోంది. వైయస్ రాజకీయ వారసత్వం జగన్ కి రాదనేది నిరూపించాలని కాంగ్రెస్ అనుకుంటే… వైయస్ ఘనతకు కళంకం తెచ్చే పని కాంగ్రెస్ చేస్తోందని చెప్పే ప్రయత్నంలో వైకాపా ఉంది. మొత్తానికి.. ఈ రెండు పార్టీ మధ్యా ఇప్పుడు వైయస్పార్ లెగసీ గేమ్ మొదలైందని చెప్పొచ్చు. ఇదే అంశమై మున్ముందు ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి వాగ్యుద్ధాలుంటాయో వేచి చూడాల్సిందే.
గమ్మత్తు ఏంటంటే.. ఈ రెండు పార్టీలకూ వైయస్సార్ కావాలి! ఆయన పాలన గొప్పదనే ప్రచారం చేసుకోవడమూ కావాలి. ఆ ఘనత ఇప్పుడు తమదే అంటే, లేదు మాది అంటూ రెండు పార్టీలూ సిగపట్లకు దిగుతున్నాయి. ఆయన పేరు లేకుండా వైకాపా జనంలోకి వెళ్లే అవకాశామే ఉండదు. కాంగ్రెస్ కూడా వచ్చే ఎన్నికల్లో ఆయన పేరునే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకుంటుందనే అనిపిస్తోంది.