తెలుగు సినిమా గొప్పదనం, ఖ్యాతి గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడేస్తున్నారీమధ్య. కొన్ని వింటుంటే ‘తెలుగు సినిమా ఇంత గొప్పదా’ అంటూ మనకే ఆశ్చర్యం వేస్తుంటుంది. వీళ్లందరూ మాట్లాడింది ఒక యెత్తు… అల్లు అర్జున్ ఈమధ్య మాట్లాడింది మరో ఎత్తు. ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో… ఎప్పట్లా రివ్యూల్ని ఏకి పడేస్తూ… తెలుగు సినిమా గొప్పదనాన్ని తన మాటల్లో వివరించాడు. బన్నీ స్పీచ్ వింటే… ”ఓహో.. తెలుగు సినిమాపై బన్నీకి ఇంత ప్రేమ ఉందా?” అని పిస్తుంది. ఆ ప్రేమకు సంతోషం కలుగుతుంది.
తెలుగు సినిమా గొప్పదదాన్ని పొగడ్డం పక్కన పెడితే.. రివ్యూ రైటర్లకు ఏమీ తెలియనదే వెక్కిరింతలు కూడా బన్నీ మాటల్లో కనిపిస్తున్నాయి – పరోక్షంగా వినిపిస్తున్నాయి. రివ్యూలు రాసే హక్కు అందరికీ ఉంది అంటూనే అసలు రేటింగులు ఇవ్వడానికి మీరెవరు? అని ఛళ్లున కొట్టే ప్రయత్నం చేశాడు. ఎమోషన్స్‌కి రేటింగులు ఏంటి? అంటూ లాజిక్కులు లాగాడు. తెలుగు సినిమాలో ఓ గొప్ప యునిక్ పాయింట్ ఉందని, అదెవరికీ అర్థం కావడం లేదని వాపోతున్నాడు. మరి బన్నీకి అర్థమైన యునిక్ పాయింట్ ఏంటి? అంటారా??
తెలుగు సినిమాలో బోల్డన్ని జోనర్లు ఉంటాయట. డాన్సులు, ఫైట్లు, యాక్షన్, థ్రిల్లర్, రొమాన్స్.. ఇలా రకరకాల ఎమోషన్స్ ఉంటాయని, టైటానిక్ లాంటి సినిమాలు కూడా ఒకట్రెండు ఎమోషన్లతో నడిపించారని, ఆ లెక్కన చూస్తే తెలుగు సినిమాలే గొప్పని వాదిస్తున్నాడు. బన్నీ దృష్టిలో యునిక్ పాయింట్ అదే. సినిమా మధ్యలో ఇంట్రవెల్ ఇవ్వడం మనదైన ముద్ర అని, హాలీవుడ్ సినిమాలకు ఇంట్రవెల్ కార్డు ఉండదని గుర్తు చేశాడు బన్నీ. అన్ని రకాల ఎమోషన్స్ ఓ సినిమాలో ఉండడం గొప్పా? లేదంటే.. ఒకే ఎమోషన్ తో సినిమా మొత్తం నడిపించడం గొప్పా?? బన్నీ వరకూ మాత్రం మొదటిదే గొప్ప! హాలీవుడ్ సినిమాలో కథ మాత్రమే చెబుతారు. సొల్లు ఉండదు. హీరోగారి బిల్డప్పులకు టైమ్ ఉండదు. మాస్‌ని లాగేద్దాం అన్న మిషతో ఐటెమ్ గీతాలు ఉండవు. అందుకే గంటన్నరలో ఆ సినిమాలు ముగుస్తాయి. గంటన్నర సినిమాకి ఇంట్రవెల్ ఏంటి??
ప్రపంచం మొత్తం తెలుగు సినిమాలవైపు చూస్తుంటే. ఇక్కడి రివ్యూ రైటర్లు మాత్రం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారన్నది బన్నీ బాధ! అందుకే తన ఆవేశాన్ని ఈ రూపంలో మరోసారి వెళ్లగక్కాడు. ఈ ప్రయత్నమంతా డీజేని గొప్ప సినిమాగా మళ్లించే ప్రయత్నం కాదంటారా?? ఎప్పుడూ తెలుగు సినిమాని నెత్తిన ఎక్కించుకోని బన్నీ.. కేవలం ఈసారే.. తెలుగు ఖ్యాతి గురించి మాట్లాడడంలో డీజే ప్రమోటీవ్ యాక్టివిటీస్ లేవంటారా?? రివ్యూ రైటరలను ఎలా ఇరుకున పెడదామా అనే ప్రయత్నం కాదంటారా? రివ్యూలపై బన్నీ ఎంత మండిపడుతున్నాడో.. బన్నీ స్పీచ్‌లు వింటుంటే అర్థం అవుతుంది. ఇదే రివ్యూ రైటర్లు.. ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్రలో బన్నీ అద్భుతంగా పోషించడానికి మెచ్చుకొన్నారే. ‘రుద్రమదేవి’ని మాత్రం విమర్శించారే. అప్పుడు లేవని గొంతు ఇప్పుడు లేస్తోందెందుకు? ‘నా పాత్రని మాత్రం చూడకండి.. సినిమా బాగుంది..’ అని అనలేదే..?? హాలీవుడ్ సినిమా కంటే రుద్రమదేవి గొప్ప అని ఇలా మితండవాదం చేయలేదే..? ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించినంత వరకూ బన్నీకి రావాల్సిన పేరు వచ్చేసింది. మైలేజీ పెరిగింది. దాంతో… రివ్యూల గురించి పట్టించుకోలేదు. డీజే అలా కాదు. ఇది తన సొంత సినిమా. ‘ఈసారి ఎలాగైనా వంద కోట్లు కొట్టేద్దాం’ అని తపించి విడుదల చేసిన సినిమా. కొన్ని ఏరియాలను చేతిలో ఉంచుకొన్న సినిమా. అందుకే.. నెటిటీవ్ విమర్శలు వచ్చేసరికి.. తల్లడిల్లిపోయాడు. డీజేని గొప్ప సినిమా చేయాలని.. టాలీవుడ్ ని తీసుకెళ్లి హాలీవుడ్ కంటే ముందు వరుసలో పెట్టాలన్న ప్రయత్నం చేశాడు. ఈ కోపాన్ని, ఆవేశాన్ని కాస్త తగ్గించుకొని.. అసలు ‘డీజే’ విషయంలో తాను చేసిన తప్పులేంటి? మైనస్సులేంటి? అనేది ఆలోచిస్తే మంచిదేమో. కనీసం తదుపరి సినిమాల్లో అయినా తప్పుల్ని తగ్గించుకొనే అవకాశం ఉంటుంది.