రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ పర్యటన సందర్భంగా లాంఛనంగా జరిగిన సమావేశాల కన్నా దాని సంకేతాలు ఎక్కువ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేవలం ఈ సందర్భానికి పరిమితమయ్యేలా పరిస్థితి కనిపించలేదని బిజెపి ముఖ్య నాయకులొకరు నాతో అన్నారు. కోవింద్ పర్యటనకు సంబంధించిన కొన్ని బాధ్యతలు చూస్తున్న ఆయన తమ అధిష్టానం వైసీపీ పట్ల సానుకూలంగానే వున్నట్టు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు.టిడిపితో తమ రాజకీయ బంధం భాగస్వామ్యం వచ్చే ఎన్నికల ప్రకటన వరకేనని, తర్వాత ఏమిటనేది అప్పుడే తెలుస్తుందని వివరించారు. జగన్ అంతగా మా మాట వినేందుకు సిద్ధపడుతున్నప్పుడు మేమెందుకు వదులుకోవాలి? మాకు ఎవరైతేనేం.. అన్నట్టు అగ్రనాయకుల ధోరణి కనిపిస్తుందన్నారు. ఈ లోగా కేసులు వాటి పరిణామం ఎలా వుంటుందో చూడాలని అన్నారు. అది కూడా మీ వైఖరిపైనే ఆధారపడి వుంటుంది కదా అని అడిగితే కొంతవరకూ అంగీకరించారు. ఇటీవలి సర్వేలలో వైసీపికి కూడా 40 శాతం ఓటింగు కొనసాగుతున్నట్టు వచ్చిన అంచనాలు కూడా బిజెపి నేతలను ఆలోచనలో పెడుతున్నాయి. జనసేన పవన్ కళ్యాణ్ పాత్రపైనా స్పష్టత కోసం చూస్తున్నట్టు కనిపిస్తుంది. పవన్ వ్యతిరేకిస్తే టిడిపికి కష్టమవుతుందనే భావన కూడా బిజెపి వర్గాల్లో వుండొచ్చు.