భారతీయ జనతా పార్టీ అడుగులకు మడుగులొత్తాలన్న తాపత్రయం, ఆతృత, అత్యుత్సాహం తెరాసకి ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు ఇంకా స్పష్టంగా అర్థమైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు బేషరతుగా కేసీఆర్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, కోవింద్ రాష్ట్రానికి వస్తుంటే సాక్షాత్తూ రాష్ట్రపతి వస్తున్న రేంజిలో ఫ్లెక్సీలేంటో…? ఆ హడావుడి ఏంటో…? స్వాగత సత్కారాల సందడి ఏంటో..? తెరాస అత్యుత్సాహానికి సరైన కారణమంటూ ఏదీ కనిపించడం లేదు. పోనీ, ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీగా అయినా తెరాస ఉందా అంటే.. అదీ లేదు. సరే, రాష్ట్ర ప్రభుత్వంలో భాజపా భాగస్వామ్య పక్షమా… అదీ కాదు! రేపోమాపో లోక్ సభ ఎన్నికలు వచ్చేస్తున్నాయీ… కాబట్టి, వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం తెరాస వెంపర్లాడుతోందని అనుకున్నా.. దానికీ ఇంకా రెండేళ్లు సమయం ఉంది. భాజపా అభ్యర్థి విషయంలో ఎందుకీ హడావుడి…? ఎట్ ద సేమ్ టైమ్.. కాంగ్రెస్ అభ్యర్థిగా మద్దతు కోరడానికి రాష్ట్రానికి వచ్చిన మీరా కుమార్ విషయంలో ఎందుకంత అమర్యాద..?
తాను దళిత అభ్యర్థిని రాష్ట్రపతి పెట్టాలంటూ గతంలో ఎప్పుడో ప్రధాని మోడీకి సూచించాను కాబట్టి, తన కోరిక మేరకే అన్నట్టుగా కోవింద్ ను ఎంపిక చేశారనే కృతజ్ఞతను చాటుకోవడం కోసమే అన్నట్టుగా కేసీఆర్ హడావుడి కనిపిస్తోంది. ఆ మాటకొస్తే… మీరా కుమార్ కూడా దళిత అభ్యర్థే కదా! ఆమె యూపీయే అభ్యర్థిగా రాష్ట్రానికి వచ్చారు. కేసీఆర్ ను కలుసుకుని మద్దతు కోరే ప్రయత్నం చేశారు. కానీ, మీరా కుమార్ కు కేసీఆర్ అపాయింట్మెంట్ తిరస్కరించారట. కేసీఆర్ సాబ్ బా..గా.. బిజీగా ఉన్నారు కాబట్టి, కనీసం ఫోన్లోనైనా మాట్లాడి మద్దతు కోరే ప్రయత్నం చేద్దామని మీరా కుమార్ అనుకున్నారు. దానికి కూడా కేసీఆర్ అనుమతించలేదు. ఫోన్లో మాట్లాడేందుకు కూడా ఒప్పుకోలేదు!
ఇదెక్కడి మర్యాద..? ఇదెక్కడి రాజకీయ సంప్రదాయం..? రాష్ట్రపతిగా కోవింద్ కే మద్దతు ఇచ్చుకోండి.. ఎవ్వరూ కాదనరు. భాజపా స్నేహ హస్తం కోసం వెంపర్లాటను ఎవ్వరూ వొద్దనరు! రాష్ట్రపతి ఎన్నికల ముసుగులో రాబట్టుకోవాలనుకుంటున్న రాజకీయ ప్రయోజనాలపైనా ఎవ్వరూ కామెంట్ చెయ్యరు! కానీ, కలవడానికి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థికి అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది కనీస మర్యాద. తెరాస తరఫున భాజపా అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసేసుకున్నామని ఆమెకి చెబితే ఎంత హుందాగా ఉండేది..? కనీసం సెంటిమెంట్ పరంగా ఆలోచించినా.. మీరా కుమార్ స్పీకర్ గా ఉన్నప్పుడే కదా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంటులో పాస్ అయింది. తెలంగాణ ఏర్పాటు వెనక అత్యంత సానుకూలంగా ఆమె స్పందించిన గతం ఉంది కదా!
సరే.. ఇవేవీ గుర్తు పెట్టుకుని ఆమెకి మద్దతు ఇవ్వమని ఎవ్వరూ కేసీఆర్ ను కోరరు. కానీ, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది కచ్చితంగా అమర్యాదే అవుతుంది అనేది కొందరి అభిప్రాయం. ఇదే సమయంలో.. ఎన్డీయే అభ్యర్థికి భారీ ఎత్తున ఫ్లెక్సీలు కట్టేసి, అతిథి సత్కారాలతో ముంచెత్తడం అనేది కచ్చితంగా సరైన రాజకీయ సంప్రదాయం కాదు! కేవలం మోడీ కనుసన్నల్లో ఉండేందుకో.. ఆయన కరుణా కటాక్ష వీక్షణాల ప్రసరణ తమపై పడేందుకో అన్నట్టుగానే కేసీఆర్ సాగిలపడిపోతున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. మీరా కుమార్ విషయంలో కేసీఆర్ అనుసరించిన వైఖరి అమర్యాదగానే ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.