తెలంగాణలో ఉనికి కోసం తెలుగుదేశం పార్టీ పోరాటం చేయాల్సి వస్తోంది. రాష్ట్ర విభజన తరువాత టి. టీడీపీలో పేరున్న నాయకులే కరువయ్యారు. ఒక్కొక్కరుగా పార్టీ ఫిరాయించేసి, గులాబీ గూటికి చేరిపోయారు. పదవులకు రాజీనామాలు చేయకుండానే మంత్రులైపోయారు! ఇన్నాళ్లూ ఇదే ఫిరాయింపుల అంశంపై టి. టీడీపీ నేతలంతా బలంగా పోరాటం చేస్తుండేవారు. న్యాయ పోరాటం చేస్తామనీ ప్రజాక్షేత్రంలో ఎండగడతామనీ నేతలు ఎప్పటికప్పుడు కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. అయితే, ఇకపై ఈ ఫిరాయింపుల టాపిక్ ను వదిలేయాలంటూ టీ నేతలకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచించినట్టు ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది.
తెలంగాణ టీడీపీ నేతలతో ఇదే విషయం ఆయన తాజాగా స్పష్టం చెప్పారట! తెరాసలో చేరిన ఎమ్మెల్యేల విషయమై పదేపదే విమర్శలు చేస్తుండటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, ఫిరాయింపు అంశాన్ని ఇక్కడితో వదిలేస్తే బెటర్ అంటూ టీ దేశం నేతలకు చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. తెరాసలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల గురించి కోర్టులో బలంగా వాదన వినిపించడం వల్ల.. ఆంధ్రాలో కాస్త ఇబ్బందికరంగా మారుతుందనీ, కాబట్టి ఈ విషయాన్ని వీలైనంత లైట్ గా తీసుకుంటే బెటర్ అనే అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఈ సూచన ప్రకారమే టీడీపీ నేతలు విమర్శలు తగ్గించుకున్నారనీ, ఫిరాయింపుల అంశమై కేసీఆర్ సర్కారు విధానాన్ని తప్పుబట్టడం మానుకునే దిశలో ఉన్నారనీ కొన్ని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
అయితే, ఈ టాపిక్ గురించి పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ దగ్గర ప్రస్థావిస్తే.. అబ్బే అదేం లేదన్నారు! ఫిరాయింపుల విషయాన్ని అస్సలు వదిలిపెట్టేదే లేదనీ, పోరాటం చేస్తామని అన్నారు. కాకపోతే, ఇప్పుడు మియాపూర్ భూ కుంభకోణానికి సంబంధించిన పోరాటానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, అందుకే ఆ టాపిక్ గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదన్నట్టుగా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి, ఫిరాయింపుల అంశానికి ప్రాధాన్యత తగ్గించామని ఆయన కూడా చెప్పకనే చెప్పినట్టు అర్థం చేసుకోవాలి.
వాస్తవం కూడా అదే కదా! జంప్ జిలానీలపై పోరాటాన్ని తెలంగాణలో ఎంత పెంచితే.. ఆంధ్రాలో టీడీపీకి అంతే ఇబ్బంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు! కొత్త నాయకత్వం కోసం ఇతర పార్టీల నుంచి కొంతమందిని తీసుకోవాల్సి వచ్చిందనీ, గెలిచే అభ్యర్థులు అవసరమనీ, ఈ క్రమంలో కొన్ని నష్టాలు తప్పవంటూ ఈ మధ్యనే ఫిరాయింపుల గురించి చంద్రబాబు చెప్పారు కదా! సో… ఏపీలో ఫిరాయింపులు తప్పు కాదనేట్టుగా చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు తెలంగాణ నేతలు ఇదే అంశమై పోరాడుతుంటే ఎలా ఒప్పుకుంటారు..? అందుకే, టాపిక్ ఈజ్ ఓవర్ అంటున్నారనే చెప్పుకోవాలి!