బాహుబలి తరవాత రాజమౌళి సినిమా ఏంటన్న విషయంలో ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. రాజమౌళి బాలీవుడ్లో ఓ సినిమా చేయడానికి ఫిక్సయ్యారని, అక్కడ యువ హీరోతో సినిమా ఉండబోతోందని, ఆ సినిమా తెలుగులో కూడా వస్తుందని, ఈ చిత్రానికి దానయ్య సహ నిర్మాతగా వ్వవహరిస్తారని వార్తలు వస్తున్నాయి. వీటిపై తెలుగు 360 ఆరా తీసింది. రాజమౌళి సన్నిహితులు చెబుతున్న వివరాల ప్రకారం… రాజమౌళి తన తదుపరి సినిమా విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయానికీ రాలేదట. సెప్టెంబరు వరకూ సినిమా విషయాలకు దూరంగా ఉండాలని రాజమౌళి నిర్ణయించుకొన్నారని తెలుస్తోంది. డిసెంబరు నాటికి కథ సిద్ధం చేసి, ఆ కథకు ఎవరు నప్పుతారో, ఆ హీరోతో సినిమా చేస్తాడట రాజమౌళి. అది బాలీవుడ్ హీరోనా, టాలీవుడ్ హీరోనా? అనే విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని, కథ డిమాండ్ చేసిన హీరోతోనే సినిమా అని, ముందు హీరో అనుకొని, ఆ తరవాత కథ రాసుకోవడం ఉండదని.. రాజమౌళి సన్నిహితులు చెబుతున్నారు. బాహుబలి తరవాత పూర్తిగా సినిమా వాతావరణానికి దూరంగా ఉంటున్నాడు జక్కన్న. తదుపరి ఎలాంటి సినిమా చేయాలి? అనే విషయమే ఆలోచించలేదని, అలాంటిది బాలీవుడ్లో సినిమా అని చెప్పడం మీడియా తొందరపాటు అవుతుందని… సన్నిహితులు క్లారిటీ ఇచ్చేశారు. సో.. రాజమౌళి చేతికి కథ వచ్చేంత వరకూ.. హీరో ఎవరన్న విషయంలో సస్పెన్స్ కొనసాగుతుందన్నమాట.