కాపుల రిజర్వేషన్లు అంశం గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీ. కానీ, ఇప్పటికీ మోక్షం లేదు. ఇదే విషయమై కాపు సంఘాల నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమాలంటూ దీక్షలంటూ సత్యాగ్రహ పాదయాత్రలంటూ తన వంతు ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నారు. ఇదే విషయమై ప్రభుత్వం కూడా అదిగో ఇదిగో ఇచ్చేస్తున్నామంటూ చేయాల్సిన కాలయాపన చేస్తూనే వచ్చింది. పోనీ, ఇప్పటికైనా మోక్షం కలుగుతుందా అంటే.. ఆ పరిస్థితి దరిదాపుల్లో కనిపించడం లేదు. కాపుల రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలే వ్యవహారం కాదనే అభిప్రాయం కలుగుతోంది.
కాపుల రిజర్వేషన్లపై ఏపీ సర్కారు జస్టిస్ట్ మంజునాధ కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ నివేదిక రాగానే రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చేస్తుందని అధికార పార్టీ నేతలు కూడా చెబుతూ వచ్చారు. అయితే, తన నివేదికతోనే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తారు అనేది వాస్తవం కాదని జస్టిస్ మంజునాధ తాజాగా వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమని కూడా బీసీల్లో చేర్చాలంటూ ఇతర కులాల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని మంజునాధ అన్నారు. పదమూడు జిల్లాల్లోనూ ప్రజాభిప్రాయ సేకరణ చేశామనీ, బలిజ, ఒంటరి, కాపుల వంటి తెగలతోపాటు ఇతర కులాలవారు కూడా పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు ఇచ్చారనీ, తమనీ బీసీల్లో చేర్చాలని వారు కోరుతున్నారని మంజునాధ చెప్పారు. ఈ రకంగా తమకు 62 కులాల వారు కోరారనీ, 31 బీసీ కులాలు గ్రూపులు మార్చాలంటూ పట్టుబడుతున్నాయని అన్నారు.
కమిషన్ నివేదికను పూర్తిస్థాయిలో తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించేందుకు ఇంకా చాలా సమయం పడుతుందని ఆయన అన్నారు. అన్ని కులాల ఇబ్బందుల్నీ తెలుసుకున్నామనీ, అయితే కాపులకు రిజర్వేషన్లు కల్పించాలా వద్దా అనేది తానేమీ చెప్పలేననీ, రాష్ట్రంలోని ప్రజల ఆర్థిక, సామాజిక వెనకుబాటు తనాన్ని అంచనా వేయడం కోసమే సర్వే జరుగుతోందని ఆయన చెప్పడం విశేషం!
చెప్పొచ్చేది ఏంటంటే.. కమిషన్ రిపోర్ట్ వచ్చినంత మాత్రాక కాపుల రిజర్వేషన్ల అంశంపై ఏ నిర్ణయం ఉండదూ అనేది! ఈ విషయం ఇప్పట్లో తేలేది కాదనే అర్థమౌతోంది. జస్టిస్ మంజునాధ ఇలా తాజాగా స్పందించడంపై ముద్రగడ కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి. ఆ మధ్య సత్యాగ్రహ పాదయాత్రలు అంటూ ఉద్యమించేందుకు ప్రయత్నించినా.. యథాప్రకారం ఆయన కిర్లంపూడి దాటి బయటకి రాలేకపోయారు! ఈసారి అన్ని జిల్లాల నుంచీ ఉద్యమం ఉంటుందని ఆ మధ్య అన్నారు. రిజర్వేషన్ల అంశంలో మరింత ఆలస్యం తప్పదనే సంకేతాలు వ్యక్తమౌతున్నీ ఈ తరుణంలో ముద్రగడ మరోసారి ఉద్యమించే ప్రయత్నం చేస్తారేమో చూడాలి.