టాలీవుడ్లో జీవిత చరిత్రల పరంపర కొనసాగుతోంది. సావిత్రి జీవిత కథని `మహానటి` పేరుతో తెరకెక్కిస్తున్నారు. పుల్లెల గోపీచంద్ కథని సినిమాగా తీయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ కథ ఇప్పుడు సినిమాగా రాబోతోంది. ఈ జాబితాలో మరో బయోపిక్ చేరింది. దర్శకరత్న దాసరి నారాయణరావు జీవిత కథ సినిమాగా రాబోతోంది. ఓ కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దాసరి శిష్యుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఆయనెవరన్నది త్వరలో తెలుస్తుంది. దాసరి కథని సినిమాగా తీస్తే ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే… దాసరిగా నటించే నటుడెవరన్నదే ప్రశ్న. దాసరి ఆహార్యం, ఆయన మేనరిజం పుణికి పుచ్చుకొన్న నటుడెవరూ కనిపించడం లేదు. ఒకవేళ కొత్త వాళ్లతో ప్రయత్నం చేసినా అది ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చెప్పలేం. దాసరి కథ అంటే… ఆయన సినీ కెరీర్లోనే కీలకంగా భావించే సినిమాల గురించి, కథానాయకుల గురించీ ప్రస్తావించాలి. వాళ్ల పాత్రల్లో ఎవరు కనిపిస్తారు?? ఎన్టీఆర్‌గా ఎవరు నటిస్తారు? చిరంజీవి, మోహన్ బాబు పాత్రలుంటాయా? అనేది చూడాలి. ఈ పాత్రలకు ద్వితీయ శ్రేణి ఆర్టిస్టులను ఎంచుకొంటే మాత్రం ఆసక్తి చప్పునచల్లారి పోతుంది. మరి ఓ కల్యాణ్ ఏం చేస్తాడో చూడాలి.