ఇటీవలి కాలంలో తెలుగుదేశంను మించి కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్సిపిపై విమర్శలు గుప్పిస్తున్నారు. పేరుకు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటున్నా వాస్తవానికి వైసీపీయే పెద్ద శక్తిగా వుందని అందరికీ తెలుసు. దానికితోడు తాజాగా మల్లాది విష్ణుతో సహా చాలామంది కాంగ్రెస్ వాదులు కొత్తగా వలస యోచనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలనాటికి ఎలాగైనా వైసీపీతో పొత్తు పెట్టుకుంటేనే మనుగడ అని కాంగ్రెస్లో చాలామంది భావిస్తున్నా అధిష్టానం అందుకు సిద్ధంగా లేదు. అలాగే మొదటి నుంచి జగన్ విషయంలో విమర్శలు చేస్తున్న కొందరు మాజీ మంత్రులు సీనియర్ నేతలు కూడా ఆ భావాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారు. వీరందరికీ రాష్ట్రపతి ఎన్నికల పోరు మంచి అవకాశంగా దొరికింది. బిజెపికి ముందే మద్దతు ప్రకటించడం, రామ్నాథ్ కోవింద్ రాక సందర్భంలో కొంత ఓవరాక్షన్ వారికి బాగా కలసి వచ్చింది. ముందే పిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి జగన్కు వైఎస్ ఫోటో పెట్టుకునే అర్హత లేదంటూ ఒక తీవ్రమైన లేఖ రాశారు. తర్వాత కాలంలో తులసి రెడ్డి వంటి వారు ఇంకా ఉధృతం చేశారు. వైసీపీ నేతలు భూమన కర/ణాకర రెడ్డి వంటివారు ఇదే స్థాయిలో సమాధానాలు సంధించారు. మొత్తంపైన కాంగ్రెస్ వైసీపీలు ఇలా తిట్టుకోవడం పాలకపక్షానికి బాగా ఆనందంగా వుంది. వచ్చే ఎన్నికల్లో బిజెపి టిడిపి వైసీపీ కలసిపోయినా ఆశ్చర్యం లేదని తులసి రెడ్డి మా చర్చలో అన్నారు. అది పెద్ద అసంభవమేమీ కాదని జగన్ కేసుల నుంచి కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తారని కాంగ్రెస్ నేతల మాట. అయితే ఏది ఏమైనా ఎపిలో కాంగ్రెస్ పునరుద్ధరణ మాత్రం దాదాపు అసాధ్యమని ఆ పార్టీకి చెందిన వారే అంటున్నారు.