అనుకున్నట్టుగానే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు! కాపులకు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం మంజునాథ కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మధ్య జస్టిస్ మంజునాథ మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్ నివేదిక గురించి, కాపుల రిజర్వేషన్ల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాపులతోపాటు దాదాపు ఓ అరవై కులాలవారు తమకు విజ్ఞప్తులు ఇస్తున్నారనీ, బీసీల్లో చేర్చమంటూ చాలా కులాల నుంచి డిమాండ్ వినిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, కమిషన్ రిపోర్టు ఇచ్చిన వెంటనే కాపులకు రిజర్వేషన్లు వచ్చేస్తాయని తాను చెప్పలేనని కూడా మంజునాథ వ్యాఖ్యానించడం విశేషం. ఇప్పుడు ఇదే వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం స్పందించారు.
కాపుల రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డబుల్ గేమ్ ఆడుతున్నారని ముద్రగడ విమర్శించారు. కాపుల కోసమే మంజునాథ కమిటీ వేశారని ముఖ్యమంత్రి చెబుతుంటే… ఈ కమిషన్ పనిచేస్తున్నది కాపుల కోసం కాదనీ, బీసీ ఆర్థిక సామాజిక స్థితిగతులను అంచనా వేయడం కోసమే అన్నట్టుగా జస్టిస్ మంజునాథ అభిప్రాయపడ్డారనీ, ఇది డబుల్ గేమ్ కాదా అని ముద్రగడ ప్రశ్నించారు. మంజునాథ కమిటీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ముద్రగడ డిమాండ్ చేశారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తారా లేదా అనేది సీఎం సూటిగా స్పష్టం చెప్పాలన్నారు.
నిజానికి, కాపుల రిజర్వేషన్లపై అధ్యయనం చేసేందుకే ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, ముద్రగడ ఉద్యమానికి దిగుతున్న ప్రతీసారీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా ఇదే విషయాన్ని పదేపదే చెబుతూ వచ్చారు. రిజర్వేషన్ల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందనీ, ఓ పక్క కమిషన్ అధ్యయం జరుగుతుంటే నివేదిక వచ్చేవరకూ ఆగలేరా అంటూ గతంలో ముద్రగడను ప్రశ్నించారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇదే మాట చెప్పారు. గత ఏడాది ఆగస్టు నాటికే కమిషన్ రిపోర్టు ఇచ్చేస్తుందని, ఆ తరువాత రిజర్వేషన్లపై ఏదో ఒకటి తేల్చేస్తామని అన్నారు.
ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మంజునాథ కమిషన్ తుది నివేదిక సిద్ధం అయ్యేసరికి చాలా సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. అంతేకాదు, ఈ రిపోర్టులో బీసీల వెనకబాటుతనానికి సంబంధించి విషయాలే ఉంటాయన్నట్టుగా కూడా సంకేతాలు ఇచ్చేశారు! దీంతో ముద్రగడ తాజాగా స్పందించారు. ముఖ్యమంత్రి తన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే.. మరోసారి ఉద్యమించే ఆలోచనలో ఉన్నట్టు కాపు సంఘాల్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.