అధికార ప్రతిపక్ష పార్టీలకు నంద్యాల ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకం. ఈ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఆయా పార్టీల మూడ్ ను ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. అందుకే, అధికార టీడీపీ భారీ ఎత్తున పార్టీ నాయకుల్ని నంద్యాల ఎన్నికల వ్యూహాల్లో భాగస్వాములను చేసింది. ముందెన్నడూ లేని విధంగా నంద్యాలలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పెండింగ్ ఉన్న పనులను ప్రభుత్వం చకచకా చేసేస్తోంది. మరోపక్క నంద్యాల రాజకీయ వ్యవహారాలను చూసేందుకు ఏకంగా నలుగురు మంత్రులను సీఎం చంద్రబాబు రంగంలోకి దించారు. అంతేకాదు, మాజీ మంత్రి కేయీ ప్రభాకర్ కి ఎన్నికల ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇక, స్థానిక నేతలకు కూడా పని విభజన స్పష్టంగానే చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తరచూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇలా నంద్యాల ఉప ఎన్నిక విషయంలో టీడీపీ హడావుడిగా ఉంది. అయితే, ఇంత జరుగుతున్నా సమన్వయ లోపం, పార్టీ నేతల మధ్య చిన్నచిన్న స్పర్థలు పార్టీని కాస్త ఇబ్బంది పెడుతున్నట్టు సమాచారం!
తాజాగా నంద్యాలలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రులు కేయీ ప్రభాకర్, ఫరూక్, ఏవీ సుబ్బారెడ్డి వంటి పెద్దలు వచ్చారు. కానీ, మంత్రి భూమా అఖిల ప్రియ రాలేదు! ఎన్నికల నేపథ్యంలో జరిగిన అత్యంత కీలక సమావేశానికి అఖిల ప్రియ రాకపోవడం ఏంటంటూ సీనియర్ నేతలు తప్పుబడుతున్నారు. ఈ విషయం అఖిల ప్రియ వరకూ చేరడంతో ఆమె స్పందించారు. ఆళ్లగడ్డ నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కలవడానికి వచ్చారనీ, దాంతో ఆ సమావేశానికి రాలేకపోయానని ఆమె వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ కారణం నిజమే కావొచ్చు. కానీ, ఇది ఎన్నికల సమయం కాబట్టి, ఇలాంటి సమావేశానికి హాజరు కాకపోవడం అఖిల ప్రియ ప్లానింగ్ లోపంగానే కనిపిస్తుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటిదే మరో ఘటన కూడా ఉంది! నంద్యాలలో కీలకమైన రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని ఇటీవలే మంత్రి అఖిల ప్రియ లాంఛనంగా పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలకు ఆహ్వానించలేదట! కేయీ ప్రభాకర్, ఫరూక్, శ్రీధర్ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిలను పిలవకుండానే ఆమె ఒక్కరే రోడ్ల విస్తరణ కార్యక్రమానికి టెంకాయ కొట్టేశారు. దాంతో సీనియర్లు కాస్త హర్ట్ అయినట్టే ఉన్నారు. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తోంది! ఈ పరిణామాలపై అఖిల ప్రియ కాస్త ఆవేదనతోనే ఉన్నారట. పార్టీలో అందరితోనూ కలిసి పనిచేస్తున్నామనీ, ఎక్కడా ఎవ్వరితోనూ ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని మంత్రి అఖిల ప్రియ అంటున్నారు. కానీ, నేతల మధ్య కనిపిస్తున్న ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అధినాయకత్వానికి కాస్త టెన్షన్ పెట్టించే వ్యవహారమే అనడంలో సందేహం లేదు.