కొత్త రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రాష్ట్రపతి భవన్ స్వభావంలో మార్పు స్పష్టమై పోయింది. మామూలుగా కొత్త నాయకుడు అధికారం చేపట్టాక తన సిబ్బందిని సహాయకులను ఎంపిక చేసుకుంటారు. కాని కోవింద్ ఎన్నిక ఫలితం వెలువడిన మరుసటి రోజునే కేంద్రం రాష్ట్రపతి భవన్లో ఆయన సహాయక అధికారులుగా వుండేవారి పేర్లు విడుదల చేసింది. ఇక రెండవది- గతంలో రాష్ట్రపతులు తమ గత అనుబంధాలతో నిమిత్తం లేకుండా ఏ పార్టీ వారినైనా కలిసి మాట్లాడటం, వినతులు స్వీకరించడం పరిపాటి. అందులోనూ కోవింద్‌తో కలసి రాజ్యసభలో పనిచేసిన పాత మిత్రులు చాలా మంది వున్నారు. వారిలో కొందరు ఫలితం తెలిశాక ఆయనను కలిసి శుభాకాంక్షలు చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు అదీ మారిపోతున్నది. ఒక ఎంపికి ఇచ్చిన అపాయింట్మెంట్ రద్దయిందని చెబుతూ రాష్ట్రపతి భవన్ ‘ పిఎంవో అంగీకరించలేదు’ అని సమాధానమిచ్చిందట. అంటే ఇకపై ఎవరు నిర్ణయాలను శాసిస్తారో వూహించవచ్చు. ప్రణబ్ ముఖర్జీ అయితే చాలా విషయాల్లో తనకు నచ్చిన వారిని తీసుకుంటూ అందరినీ కలుసుకుంటూ కాలం గడిపారు. కోవింద్ పదవీ కాలం అందుకు భిన్నంగా వుండబోతుంది.