దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది హైదరాబాద్ లో బయటపడ్డ డ్రగ్స్ కేసు. మొదట, కొన్ని స్కూళ్లలో డ్రగ్స్ ప్రభావం ఉందని బయటపడింది. కొన్ని స్కూళ్లకు నోటీసులు ఇవ్వడం, కొంతమందికి కౌన్సెలింగ్ లు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో సినీ ప్రముఖుల ప్రస్థావన రాగానే సంచలనమైపోయింది. కొంతమంది సినీ ప్రముఖులకు నోటీసులు పంపడం.. రోజుకొకరి చొప్పున విచారణకు సిట్ పిలుస్తూ ఉండటం ప్రస్తుతం జరుగుతోంది. గడచిన కొన్ని రోజులుగా డ్రగ్స్ కేసు హెడ్ లైన్స్ లో ఉంటోంది. ఇంకొన్నాళ్లు కూడా ఉంటుందని అనడంలో సందేహం లేదు. అయితే, ఈ క్రమంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పై కూడా అధికార పార్టీలో కొంత ఆందోళన వ్యక్తమౌతోంది అనడంలో సందేహం లేదు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు తెరాస సర్కారుకు భారీ ఎత్తున ప్రచారమే చేసింది. ప్రస్తుతం ఈ డ్రగ్స్ కేసు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా హైదరాబాద్ గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారుల తదుపరి మూవ్ ఎప్పుడు ఎలా ఉంటుందనేది కొత్త చర్చ! సిట్ కార్యాచరణకీ… హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కీ సంబంధం ఏంటనే కదా అనుమానం..? ఈ రెంటికీ లింక్ కచ్చితంగా ఉందనే చెప్పాలి.
స్కూళ్లూ, సినిమా రంగం అయిపోయిన తరువాత సిట్ దృష్టి సారించబోతున్న రంగం ఐటీ! అవును, డ్రగ్స్ వాడకం దారుల్లో చాలామంది ఐటీ ఉద్యోగులు ఉన్నారనీ, ప్రముఖ కంపెనీల్లో పనిచేస్తున్న కొంతమంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు డ్రగ్స్ కు బానిసలయ్యారని తాజా విచారణ తేలినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. బానిసలు అయిన ఉద్యోగుల వివరాలను కొన్ని సంస్థలకు ఇప్పటికే పంపించినట్టు సమాచారం. సినిమా రంగ ప్రముఖుల విచారణ అయిపోయిన తరువాత, ఐటీ రంగంపైనే ప్రధానంగా దృష్టి సారించాలని సిట్ అధికారులు అనుకుంటున్నారు. అయితే, ఐటీ కంపెనీలకు నోటీసులు పంపించడం అనే విషయమై ప్రభుత్వ వర్గాల్లో కొన్ని మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే, ఐటీ కంపెనీలకు నోటీసులు అంటే… అది అంతర్జాతీయ స్థాయి వార్త అవుతుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో డ్రగ్స్ కేసు నేపథ్యంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు కొంత ఇబ్బందికరంగా మారిందనీ, ఐటీ కంపెనీలకు కూడా నోటీసులు వెళ్లడం, అక్కడ కూడా సిట్ అధికారుల హడావుడి మొదలైతే.. అంతర్జాతీయ కార్పొరేట్ సర్కిల్స్ లో బ్రాండ్ ఇమేజ్ పరిస్థితి ఏంటనేది చర్చనీయం అవుతుందని అంటున్నారు. అందుకే, ఇదే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించిన తరువాతే సిట్ తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రస్తుతానికి తెలుస్తోంది. అయితే, డ్రగ్స్ కేసు విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినకుండా ఈ డ్రగ్స్ అంశమై డీల్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.