రాజీనామా నాటకం నడిపి 24 గంటలైనా గడవక ముందే బీహార్ జెడియు నేత నితిష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఎన్నికల్లో ప్రజలముందు జట్టుకట్టి ప్రజల ఓట్లు పొందిన ఆర్జేడీని పక్కన పెట్టి అంత క్రితం భాగస్వామిగా వున్న బిజెపితో మళ్లీ మారు మనువు చేసుకున్నారు. అప్పటి ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీయే ఇప్పుడూ అదే పదవి తీసుకున్నారు. నితిష్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాటి ప్రహసనాలకు లోటు లేదు. లాలూ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జనతాదళ్ నుంచి విడిపోయి సమతాపార్టీ ఏర్పాటు చేశారు. ఆ దశలో 2000 ఎన్నికల్లో మెజార్టి రాకపోయినా నాటి ప్రధాని వాజ్పేయి ఆశీస్సులతో ముఖ్యమంత్రి పదవి చేపట్టి వారంలోనే దిగిపోయారు. తర్వాత తన పార్టీని జెడియులో లీనం చేసి రెండు సార్లు బిజెపితో కలిసి అధికారం చేపట్టారు.నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం సహించలేనంటూ 2013లో ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగి దళితుడైన రాం మాంఝీని కూచోబెట్టి ఏడాదిలో మళ్లీ ఆ పదవిలోకి వచ్చారు. 2015లో మతతత్వ శక్తులపై పోరాడాలంటూ ఆర్జేడీతో కలసి మహాకూటమి ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చారు. అయితే క్రమంగా లాలూతో వైరం పెంచుకుంటూ బిజెపికి దగ్గరయ్యారు. వారి మధ్య చాలా మంతనాలు జరుగుతున్నట్టు సమాచారముంది. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికలలోనూ బిజెపినే బలపర్చారు. ఈ లోగా లాలూ కుమారుడైన ఉప ముఖ్యమంత్రి తేజస్విపై సిబిఐ కేసులను సాకుగా చూపించి వొత్తిడి పెంచారు.వారు దారికి రాలేదంటూ తనే రాజీనామా చేసి బిజెపితో కలసి మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ చర్యపై కూటమిలోని మూడవ భాగస్వామి కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఆర్జేడీ కాంగ్రెస్ కలిస్తే మెజార్టికి కేవలం 15 స్థానాలే తక్కువగా వుంటాయి.ఇప్పుడు జెడియు బిజెపిల కలయికకు కొద్దిపాటి మెజార్టి మాత్రమే వుంటుంది. నితిష్ అనుయాయులు కొందరు బిజెపితో పొత్తును జీర్ణం చేసుకోలేకపోతున్నారు. వారు గనక ఏ మాత్రం తిరగబడినా ఈ ప్రభుత్వం నిలబడదు. కాబట్టి నితిష్ ప్రభుత్వ మనుగడ నల్లేరు మీద బండిలా ఏమీ వుండదు. బిజెపికి మాత్రం రాజకీయంగా ఇది చాలా లాభదాయకం. నిజానికి తాను నితిష్ను కూలగొట్టడానికి సహకరిస్తారని లాలూ కేంద్ర బిజెపికి సంకేతాలు పంపినట్టు సమాచారం రావడం వల్లనే నితిష్ ఇలా చేయబలసి వచ్చిందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఏమైనా రాజకీయాల్లో అధికారం కోసం ఎవరైనా ఎవరితోనైనా చేతులు కలపొచ్చని నితిష్ మరోసారి నిరూపించారన్నమాట.