ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా ఫ్యాన్స్ ఏర్పడటం చాలా అరుదు. అసలు అలా జరగదనే చెప్పాలి. కానీ సాయి పల్లవి విషయంలో జరిగిపోయింది. మలయాళం ప్రేమమ్ తో స్టార్ అయిపోయింది సాయి. ఈ సినిమాని మలయాళంలో చూసి ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు మిగతా సినీ జనాలు. ఫిదాతో టాలీవుడ్ కి వచ్చింది పల్లవి. ఇది ఆమెకు మొదటి తెలుగు సినిమా. అయితే ఆల్రెడీ ప్రూవ్ అయిన హీరోకి వచ్చినంత అప్లాజ్ వచ్చింది సాయి పల్లవి ఎంట్రీ సీన్ కి. ట్రైన్ ను క్యాచ్ చేయడానికి ‘భానుమతి’ పరుగెత్తుకుంటూ వస్తుంటే థియేటర్లలో విజిల్స్ పడిపోయాయి. అది శేఖర్ కమ్ముల మ్యాజిక్ కావచ్చు. అల్టీమేట్ గా సాయి పల్లవికి ఫిదా అయిపోయారు ప్రేక్షకులు.
ఇప్పడు సాయి పల్లవి టాలీవుడ్ టాక్ అఫ్ ది టౌన్. ఆమె ఓకే అంటే చాలు… అడ్వాన్స్ లు ఇచ్చేయడానికి బోలెడు మంది నిర్మాతలు లైన్ లో వున్నారు. కానీ సాయిపల్లవి చాలా లిమిటెడ్. తనకు తానే కొన్ని షరతులు పెట్టుకుంది. ఆ మధ్య ఎదో కారణంతో మణిరత్నం సినిమా ఆఫర్ కూడా రిజెక్ట్ చేసింది. నిజానికి చెలియాలో మొదట సాయి పల్లవినే అనుకున్నారు. కానీ ఎందుకో నో చెప్పేసింది.
బేసిగ్గా సాయి పల్లవి హీరోయిన్ అవుదామని అనుకోలేదు. మంచి డ్యాన్సర్ . డ్యాన్స్ అంటే చాలా ఫ్యాషన్. చాలా డ్యాన్స్ షోలు కూడా చేసింది. ఒక్క డ్యాన్స్ మాత్రమే కాదు. సాయి పల్లవి మంచి చదువరి. విదేశాల్లో మెడిషన్ పూర్తి చేసింది. కార్డియాలజీ చదవాలనే కోరిక ఉంది. ఐతే అనుకొకుండా ప్రేమమ్ ఆఫర్ వచ్చింది. చేసింది. కట్ చేస్తే క్రేజీ హీరోయిన్ ఐయింది. ఐతే సినిమాల పై పెద్ద ఆత్రుత చూపే రకం కాదు. ”నచ్చిన పాత్రే చేద్దాం. కుదరకపోతే డాక్టర్ గా సేవ చేద్దాం” అనే అభిరుచి ఆమెది. ప్రేమమ్ రిలీజ్ అయిన తర్వాత ”’ ఎంతకాలం సినిమాలు చేస్తానో తెలీదు. మరో సినిమా చేయపోయినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. సినిమా కంటే చేయాల్సిన పనులు చాలా వున్నాయి” అని ఓ ఇంటర్వ్యూ లో స్టేట్మెంట్ ఇచ్చింది సాయి.
ఐతే ఇప్పుడు ఆమె మనసు మారినట్లు కనిపిస్తుంది. ఇకపైన తన ద్రుష్టి సినిమాపైనే అని అంటుంది పల్లవి. ”మెడిషన్ అయిపోయింది. కార్డియాలజీ చదవాలని ఉంది. ఐతే వయసు అందం వున్నప్పుడే సినిమాలు చేయగలం. చదువు ఎప్పుడైనా చదవొచ్చు. ప్రస్తుతం సినిమాలపై ద్రుష్టి పెడతా” అని తన మనసులో మాట చెప్పింది సాయి. సో.. సాయిపల్లవి మనసు మారినట్లే. ఆమె అభిమానులు కూడా ఇదే కావాలి మరి.