దేశానికి బానిసత్వం పోయినా కొందరికి బానిస భావాలు పోలేదు. సూటూ బూటూ లేకపోతే కొన్ని హోటళ్లు, క్లబ్బుల్లోకి రానివ్వక పోవడం అనేది ఇప్పటికీ చాలా చోట్ల ఉంది. స్వాతంత్ర్యం వచ్చినా ఈ బానిస బుద్ధి ఏమిటని విమర్శలు వచ్చినా కొందరు ప్రబుద్ధులకు బుద్ధి రావడం లేదు. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలోని మహమద్ బాగ్ క్లబ్ లోకి ఓ అతిథిని అనుమతించలేదు. ఆ క్లబ్ లో ఓ కార్యక్రమం నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉపాధ్యక్షుడు మౌలానా సాదిఖ్ వెళ్లారు. ఆయన కోటు బూటు కాకుండా సంప్రదాయ కుర్తా ధరించి వెళ్లారు.
దీంతో క్లబ్ సిబ్బంది ఆయనను లోపలికి పోనివ్వలేదు. తనకు ఆహ్వానం ఉందని ఆయన చెప్పినా వినలేదు. తెల్లదొరల్లా సూటూ బూటూ ఉన్నవారినే క్లబ్ లోపలికి అనుమతిస్తామని వారు చెప్పారు. వారితో ఎంత వాదించినా లాభం లేకపోవడంతో ఆయన వెనక్కి వెళ్లిపోయారు.
ఆ తర్వాత రాజ్ భవన్ కు వెళ్లి యూపీ గవర్నర్ రాం నాయక్ ను కలిశారు. తనకు జరిగిన అవమానం గురించి వివరించారు. దీంతో గవర్నర్ తక్షణం స్పందించారు. ఈ ఘటనపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కొన్నాళ్ల కిందట చెన్నైలో పంచె కట్టుకుని వెళ్లిన జడ్జిని ఇలాగే ఓ క్లబ్బు వారు లోనికి రానివ్వలేదు. తెల్లవాడు పోయినా బానిస భావాలున్న వారిలో మార్పు రాకపోవడంతో తరచూ ఎవరో ఒకరు అవమానాలకు గురవుతూనే ఉన్నారు. ఇన్నాళ్లో ఈ మానసిక బానిసత్వం !