ఇద్దరు నేపాలీ యువతుల నిర్భంధ వెట్టిచాకిరి, లైంగిక దోపిడి నేరాల్లో అరెస్టుకి తగిన ఆధారాలు పోలీసులకు లభించాయి. ఇందులో నిందితుడైన సౌదీ దౌత్యవేత్త కార్యాలయంలో ఒక అధికారి ఆయన సహాయకులూ న్యూఢిల్లీ కి ఆనుకుని వున్న గుర్గావ్లోని తమ నివాసాన్ని ఖాళీ చేసి ఎంబసీలోకి మకాం మార్చారు. దౌత్యపరమైన రక్షణలను అడ్డం పెటట్టుకుని వారు ఈ కేసు నుంచి బయటపడాలనుకుంటున్నారని ఇల్లు మార్పిడే చెప్పేస్తోంది.. నిందితుడి భార్య స్వయంగా ఈ ఇద్దరు యువతులనీ ”అతిధుల సంతృప్తి” కోసం పంపేదని నిర్ధారించకున్న పోలీసు అధికారులు అరెస్టు విషయంలో నిర్ణయం ప్రభుత్వానిదేని హోం మంత్రిత్వ శాఖకు వివరాలు తెలియచేశారు. ఈ సంఘటన కూడా అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమన్న విషయాన్ని పక్కన పెడితే ఒక దేశానిక మరో దేశంలో ప్రాతినిధ్యం వహించే ఉన్నత స్ధాయి యంత్రాంగంలో వున్నవారే సీ్త్రలను కట్టి హింసించడం, లైంగికంగా దోపిడి చేయడం, చేయించడం ఒక విషయమే అనుకోవడం లేదంటే సంపన్న సౌదీ అరేబియాకు సీ్త్రల పట్ల వున్న దృక్పధం ఖరారౌతూంది. విచారం కలుగుతుంది.
ఆ ఇద్దరు నేపాలీ మహిళలు రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు. వీరి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని స్త్రీ శరీరాలతో వ్యాపారం చేసే ముఠాలు ఉపాధిని ఎరగా వేసి వీరిని ఈ నరక కూపంలోకి నెట్టాయి. కిరాయి కింద వచ్చిన వీరిని భారత్‌లోని సౌదీ అరేబియా దౌత్య అధికారి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా గత నాలుగు మాసాలుగా వీరితో నానా చాకిరీ చేయించుకుంటున్నారు. వీరి శ్రమను నిలువునా దోచుకోవడమే గాక, లైంగిక దోపిడీ కూడా యథేచ్ఛగా సాగించారు. వారికే కాకుండా, వారి ఇంటికొచ్చే అతిథుల కామ వాంఛలను కూడా తీర్చాలని బలవంతం చేసేవారు. అందుకు నిరాకరిస్తే గదిలో బంధించి తిట్టి కొట్టి హింసించే వారు.
విషయం తెలిసి మహిళా సంఘాలు ఆందోళన చేయడంతో గుర్గావ్ పోలీసులు రంగంలో దిగి నేపాలీ యువతుల ను విడిపించారు. మహిళా సంఘాల వత్తిడి వల్లే భారత విదేశాంగశాఖ సౌదీ అరేబియా విదేశాంగ శాఖకు విషయం తెలియజేసింది. ఈ ఆరోపణల్లో నిజం లేదని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయం ఒకే మాటలో కొట్టిపారేసింది. ఐక్యరాజ్య సమితిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ, నిర్బంధ వెట్టి చాకిరీ, అవయువాల అక్రమ రవాణా ముఠాల నెట్వర్కును అంతమొందించాలని పిలుపునిస్తున్న పాలెర్మీ-2000 ప్రోటోకాల్‌పై సంతకం చేసిన భారత్ దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో తటపటాయిస్తోంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల అక్రమ రవాణా తరువాత ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, పిల్లల అక్రమ రవాణా పెద్ద వ్యాపారమైపోయింది.నిస్సహాయ స్థితిలో వున్న మహిళలను, పిల్లలను, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరక్షరాస్యులైన వారిని, మాయ మాటలు చెప్పి ప్రాంతాలు, దేశాల హద్దులు దాటిస్తున్నారు. వీరిలో ఎక్కువ భాగం 10-16 ఏళ్ల మధ్య వయసున్న బాలికలే.
ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, యురేసియా, సహారా, ఆఫ్రికా దేశాల్లో ఈ అక్రమ రవాణా ఎక్కువగా సాగుతోంది. మన దేశంలో మహిళలు, పిల్లల అక్రమ రవాణాలో పేరు మోసిన మొదటి అయిదు రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ (ఉమ్మడి) వుంది. మానవ అక్రమ రవాణాదారులు అమాయక మహిళలను వ్యభిచార కూపంలోకి దించి ఒక్కొక్కరి ద్వారా రోజుకు సగటున రు.500 దాకా వ్యభిచార గృహయజమానులు సంపాదిస్తున్నారు. అలా ఒక్కొక్క రెడ్ లైట్ ఏరియాలో 50 లక్షల దాకా సంపాదిస్తున్నారు. దేశంలోను, ఇతర దేశాల్లోను ఇటువంటి ఏరియాల నుంచి కొన్ని వందల కోట్లు ఆర్జిస్తున్నారు.
కొల్కతా నడి బొడ్డున రూపాశ్రీ సర్కార్ అనే మహిళతో కలిసి పోలీసు అధికారులు వేశ్యా గృహాన్ని ఎలా నడిపిందీ, విఐపిలు, ఎమ్మెల్యేలకు అక్కడి నుంచి వేశ్యలను ఎలా సరఫరా చేసిందీ ఈ మధ్యే బయట పడింది. హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల ఏటా ప్రపంచ వ్యాపితంగా 25 లక్షల మంది బలవుతున్నారు. వీరిలో అత్యధికులు బాలికలే. ఇది అంతకంతకూ విస్తరించి ఒక పెను సామాజిక సమస్యగా మారడంతో దీనిపై పోరాటానికి ఐక్య రాజ్యసమితి నడుం బిగించి జులై 30ని మానవ అక్రమ రవాణా వ్యతిరేకం దినంగా పాటించాలని పిలుపునిచ్చింది. అక్రమ రవాణాను అరికట్టేందుకు వర్మ కమిటీ అనేక విలువైన సిఫారసులు చేసింది.వాటిని ప్రభుత్వాలు ఇంతవరకు అమలులో పెట్టిన పాపాన పోలేదు. అక్రమ రవాణా కేసులు 2014లో 5,466 నమోదయితే అందులో చార్జిషీట్ దాకా వచ్చినవి 4,489. అందులో శిక్షలు దాకా వచ్చినవి 1029 మాత్రమే. ఈ సమస్యని నివారించడంలో ప్రభుత్వాల చిత్తశుద్ధిని ఈ అంకెలే ఎండగడుతున్నాయి.
నేపాలీ యువతుల కేసులో భారతదేశం గట్టి పట్టుబడితే సౌదీ అరేబియాతో సంబంధాల మధ్య ఇబ్బందికరమైన పరిస్ధితులు తలఎత్తవచ్చు. అయినా కూడా మానవహక్కులు, స్త్రీ గౌరవ మర్యాదలు పట్ల భారత్ నిబద్ధత సమస్త ప్రపంచానికీ అర్ధమౌతుంది. అపుడు నరేంద్రమోది 56 అంగుళాల ఛాతి విరుచుకుని దేశదేశాలు తిరగడంలో భారతదేశం గర్వపడుతుంది.