దేవిశ్రీని అనుకరించే సంగీత దర్శకుల్లో తమన్ కూడా ఉంటాడు. స్టేజీపై రాక్ స్టార్లా ఉండాలని కాస్త తాపత్రయపడుతుంటాడు. తన ఆడియో ఫంక్షన్లో అందరితో, కనీసం హీరోతో స్టెప్పులు వేయించడం దేవిశ్రీ అలవాటు. అదే అందిపుచ్చుకొన్నాడు తమన్. ఆయన సంగీతం అందించిన చిత్రం ‘మహానుభావుడు’. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేజీపై పాట పాడుతూ చిందులేశాడు తమన్. అంతే కాదు… మారుతితో కూడా స్టెప్పులు వేయించాడు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రభాస్ తో కూడా ఓ స్టెప్పు వేయించాలని చూశాడు తమన్. అయితే ప్రభాస్ మాత్రం నవ్వుతూ.. తిరస్కరించాడు. ”నాకసలే ఒంట్లో బాగోలేదు.. ఇప్పుడు స్టెప్పులు లాంటివేం పెట్టుకోకు” అంటూ.. తమన్ కోరికను సున్నితంగా తోసిపుచ్చాడు. ప్రభాస్ అసలే సిగ్గరి. మాట్లాడడానికే మొహమాటపడిపోతుంటాడు. అలాంటి ప్రభాస్తో స్టెప్పులు వేయించాలనుకోవడం అత్యాసే. ‘మిర్చి’ ఫంక్షన్లో దేవిశ్రీ ప్రసాద్ పట్టుపడితే.. రెండు స్టెప్పులేశాడు ప్రభాస్. సరిగ్గా… ఇక్కడా అదే సీన్ రిపీట్ చేయాలని చూశాడు తమన్. కానీ.. ప్రభాస్ ముందు పప్పులుడకలేదు.