తెలుగుదేశం నేతలందరూ అదే బాటలో విమర్శలు పెంచుతున్నారు. ఇదే విషయాన్ని ‘తెలుగు360’ రెండ్రోజుల కిందటే చెప్పింది. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే! అదేనండీ.. ప్రతిపక్ష నేత జగన్ పై ‘రాయలసీమ వ్యతిరేకి’ అనే ముద్ర వేయడం కోసం టీడీపీ నేతలంతా ఒక టీమ్ గా పనిచేస్తున్నారని. సీమలో వైకాపాను మరింత బలహీనం చేయాలనే మిషన్ లో భాగంగానే ఈ మూకుమ్మడి మాటల దాడి మొదలైంది. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏరాసు ప్రతాపరెడ్డి మాత్రమే ఆ మాట అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి సీమకు నీళ్లు తెస్తుంటే జగన్ అడ్డుకుంటున్నారనీ, ఆయన రాయలసీమకి చెందినవారా, తెలంగాణకు చెందినవారా అనే అనుమానం కలుగుతోందని ఏరాసు విమర్శించారు. ఇప్పుడు అదే మాట పట్టుకుని టీడీపీ నేతలంతా విమర్శలు చేస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇదే అంశమై మాట్లాడుతూ.. రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నీళ్లు తెస్తుంటే, ఏదో దొంగతనం చేస్తున్నారంటూ జగన్ పత్రికలో రాస్తున్నారంటూ విమర్శించారు. పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల అవుతుంటే, తన పత్రిక ద్వారా తెలంగాణ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారనీ. మీరు రాయలసీమలోనే పుట్టారా అనే అనుమానం కలుగుతోందనీ, ఇక్కడి ప్రజలపై విషయం ఎందుకు కక్కుతున్నారనీ, ఇక్కడి ప్రజల కష్టాలు కనిపించడం లేదా అంటూ విమర్శించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా ఇదే విషయమై మాట్లాడుతూ.. జగన్ తీరు మార్చుకోకపోతే ప్రజలందరూ బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని అన్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. నంద్యాల, కాకినాడ ఓటమి తరువాత జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. రాజకీయంగా ఒక క్యారెక్టర్ అంటూ లేని పార్టీకి భవిష్యత్తు ఉండదనీ, తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడం తగ్గించుకోవాలని సూచించారు. సీమ ప్రజలకు చంద్రబాబు నీళ్లిస్తుంటే ఓర్చుకోలేని ప్రతిపక్ష నేత, తన పత్రికలో ఇష్టం వచ్చినట్టు రాయిస్తున్నారంటూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా విమర్శించారు.
ఇలా టీడీపీ కీలక నేతలంతా జగన్ పై ‘రాయలసీమ వ్యతిరేకి’ అనే ముద్రను వేసేందుకు మూకుమ్మడి మాటల దాడికి దిగారు. దీనిపై ఇప్పటికీ వైకాపా ప్రతి స్పందన సరిగా లేదు. మళ్లీ అంబటి రాంబాబుతో ప్రెస్ మీట్ పెట్టించేస్తే సరిపోతుందని అనుకుంటే… ఈ తీవ్రత వైకాపాకి అర్థం కాలేదనే అనుకోవాలి! సాక్షి రాతలతో జగన్ కు సంబంధం అంటగట్టడమేంటని మొన్ననే అంబటి అన్నారు. మళ్లీ అదే వాదనను వినిపించే ప్రయత్నం చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. రాయలసీమ ప్రాంతంపై టీడీపీ ప్రత్యేక పొలిటికల్ ఫోకస్ పెట్టిందని టీడీపీ నేతల తాజా విమర్శలే అర్థమౌతున్నాయి. ఇవేవో ఊసుపోని విమర్శలుగా టీడీపీ మొదలుపెట్టలేదు. దీని వెనక సీమలో వైకాపా ఇమేజ్ ను తగ్గించి, అక్కడి ప్రజల్లో జగన్ పై వ్యతిరేక భావం కలిగించడం వారి లక్ష్యం. మరి, ఈ లక్ష్యాన్ని వైకాపా గుర్తిస్తుందా లేదా అనేది చూడాలి.