కేసీఆర్ సర్కారును సమర్థంగా ఎదుర్కోవడంలో ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ తడబడుతూనే ఉంటుంది. కాంగ్రెస్ నేతలు సరైన వ్యూహ రచన లేకుండా కార్యాచరణకు దిగుతూనే ఉంటారు. సరైన ఫలితాలు సాధించలేక సతమతమౌతూనే ఉంటున్నారు. కేసీఆర్ సర్కారును ఎండగట్టే అవకాశం ఉన్న అంశాల్లో కూడా సరైన వ్యూహంతో ప్రజల్లోకి దూసుకెళ్లలేకపోతున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నానికే తెలంగాణ కాంగ్రెస్ శ్రీకారం చుడుతోందని చెప్పాలి! కేసీఆర్ సర్కారు చేపడుతున్న కొత్త సచివాలయం నిర్మాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇదే విషయమై ప్రజల నుంచి కూడా మద్దతును కూడగట్టేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేస్తోంది.
రాష్ట్రంలో కొత్త సచివాలయం అవసరం ఉందా, లేదా అనే అంశంపై ఓటింగ్ నిర్వహించబోతున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత వి. హన్మంతరావు చెప్పారు. ఈ నెల 26 ఓటింగ్ జరుగుతుందనీ, ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకూ 20 కేంద్రాల్లో ఓటింగ్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆ మర్నాడు, అంటే 27న ఫలితాలు వెల్లడి చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి తనకున్న వాస్తు పిచ్చితో సచివాలయం నిర్మించాలని చూస్తున్నారంటూ విమర్శించారు. కొత్త సెక్రటేరియట్ నిర్మించాల్సిన అవసరం ఇప్పుడేముందనీ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప కొత్తగా ఒరిగేది ఏదీ ఉండదని వీహెచ్ ఆరోపించారు. బ్యాలెట్ ద్వారా ప్రజలు తమ వ్యతిరేకతను చెప్పాలనీ, ఆ తరువాతైనా ముఖ్యమంత్రి ఆలోచనా విధానంలో మార్పు వస్తుందేమో చూద్దామని అన్నారు.
నిజానికి, సచివాలయం నిర్మాణం అవసరమా అనే చర్చ ఎప్పట్నుంచో ఉంది. దీనిపై ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం రాజకీయంగా వారికి కలిసి వచ్చే అంశం అవుతుందని కాంగ్రెస్ భావిస్తున్నట్టుంది. అయితే, ఈ వ్యూహంలో లోపమంతా ఓటింగ్ కు వెళ్లడంలోనే కనిపిస్తోంది. 20 కేంద్రాలు ఏర్పాటు చేసి, అక్కడి ప్రజలు వచ్చి ఓట్లు వేయాలని అంటున్నారు. ఇక్కడే అసలు సమస్య ఉంది. ప్రస్తుతం దసరా పండుగ సెలవు రోజులు, పైగా ఓటింగ్ నిర్వహిస్తున్నది కూడా పని దినాల్లోనే. అలాంటప్పుడు సాధారణ ప్రజలు ఎందుకొస్తారు..? సరే, ఇలాంటి ఓటింగ్ నిర్వహించాలనుకుంటే.. ముందుగానే ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. ఆ పని కూడా కాంగ్రెస్ చేయలేదు. 20 కేంద్రాల్లో జరిగే ఓటింగ్ లో కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఎక్కువగా పాల్గొంటారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి, 27న ఫలితాలు వెల్లడించినా.. అందులో సచివాలయ నిర్మాణం వద్దనేదే మెజారిటీ అభిప్రాయమే ఉంటుంది కదా! ఏ కొద్దిమందో వేసిన ఓట్లను, అదీ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే వేసిన ఓట్లను మొత్తం రాష్ట్ర ప్రజల అభిప్రాయంగా కాంగ్రెస్ చెప్పడం వల్ల ఏం ప్రయోజనం..? ఏ ఎస్సెమ్మెస్సుల ద్వారానో, వాట్సాప్ గ్రూప్ ద్వారానో, లేదంటే ఒక నంబర్ కు మిస్డ్ కాల్స్ ఇవ్వడం ద్వారానో ప్రజాభిప్రాయం సేకరిస్తామంటే కొంతైనా ప్రయోజనం ఉండేది. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకుంటే బాగుండేది. అంతేగానీ, 20 చోట్ల కేంద్రాలు పెడితే.. సరైన స్పందన రాకపోవచ్చనేదే విశ్లేషకుల మాట. మొత్తానికి, ఈ కార్యక్రమాన్ని కూడా టి. కాంగ్రెస్ సరైన వ్యూహంతో చేస్తున్నట్టు కనిపించడం లేదు.