ఎన్ టీయార్ కి భారతరత్న అనే అంశం ఎప్పటినుంచో చర్చల్లో నలుగుతున్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం లో ఉండటం వల్ల సిఫారసు చేయలేదనీ, కొన్నిసార్లు అనుకూల ప్రభుత్వాలు ఉన్నప్పటికీ తగినంత ప్రయత్నాలు ఆ దిశగా జరగలేదనీ చర్చలు నడిచాయి. ఇక కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం లోని వ్యక్తులే పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉన్న నాయకులకి భారతరత్న ని ఇవ్వరని ప్రకటించడం కూడా జరిగింది. అయితే మరి తమిళనాడు లో ఎంజీయార్ కి ఎలా భారతరత్న ఇచ్చారనే కౌంటర్లు కూడా ఎదురయ్యాయి. అయితే ఈ చర్చ అంతా ఒక ఎత్తు అయితే ఇవాళ లక్ష్మీ పార్వతి చేసిన ప్రకటన ఒక ఎత్తు.
ఆ మధ్య ఒక కొత్తవాదన వచ్చింది. ఎన్ టీయార్ కి భారతరత్న ప్రకటిస్తే, ఆయన లేరు కాబట్టి అధికారికంగా దాన్ని అందుకోవలసింది ఆయన భార్యగా లక్ష్మీ పార్వతియే. అలా జరగడం చంద్రబాబు తో పాటు ఎన్ టీయార్ కుటుంబ సభ్యులకి కూడా ఇష్టం లేదు కాబట్టే కనీసం టిడిపి పార్టీ తరపున భారతరత్న విషయమై కేంద్రం మీద ఒత్తిడి చేయడం లేదు అనేది ఆ వాదన. అయితే ఇవాళ లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ, ఒకవేళ తాను అడ్డం అనుకుని ఆ ప్రయత్నాలు చేయకపోతే మాత్రం, తాను తప్పుకుంటాననీ, ఎన్ టీయార్ కుటుంబసభ్యులు ఎవరైనా భారతరత్న ని అందుకోవచ్చనీ, దానికి తాను అభ్యంతరం చెప్పననీ, కాబట్టి మహానాడు లో ఎన్ టీయార్ కి భారతరత్న విషయమై టిడిపి తీర్మానం చేసి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని ఆమె అన్నారు.
అయితే ఈ ప్రకటనలో కూడా కొన్ని మెలికలు లేకపోలేదు. ఒకవేళ ఈ ప్రకటనని ఆహ్వానించి ఆ మేరకు టిడిపి తీర్మానం చేస్తే మాత్రం, ఇంతకాలం కావాలనే తాము ఎన్ టీయార్ కి భారతరత్న కై ప్రయత్నం చేయలేదని ఒప్పుకున్నట్టు అవుతుంది. అలాగే, ఒక ఎంజీయార్ కి తప్ప మరే రాజకీయనాయకుడికీ భారత రత్న దక్కలేదు. అది కూడా కేంద్రానికి కీలక సమయం లో మద్దతు ప్రకటించడానికి అన్నా డిఎంకె అప్పట్లో షరతు పెట్టి దాన్ని సాధించుకుంది. అందులోనూ ఎంజీయార్ అనంతరం జయలలిత కి పూర్తి స్థాయిలో పార్టీ కేడర్ నుంచి మద్దతు లేని సమయం లో ఎంజీయార్ కి ఆ గౌరవాన్ని సాధించడం ద్వారా జయలలిత తన రాజకీయ ప్రస్థానాన్ని సుగమం చేసుకుంది. ఏది ఏమైనా పద్మ అవార్డులు కూడా వివాదాస్పదం అవుతున్న ఈ పరిస్థితుల్లో భారత రత్న వచ్చినా రాకపోయినా ఎన్ టీయార్ అనే పేరుకి తెలుగు ప్రజల్లో ఉన్న ఆదరణకి ఏ ఢోకా లేదు!!