ఉత్కంఠత నింపుతూ, వినోదాన్ని పంచుతూ..సూపర్ హిట్ రియాలిటీషోగా నిలిచిన కార్యక్రమం బిగ్ బాస్. 70 రోజుల ఈ ప్రయాణానికి పుల్ స్టాప్ పడింది. బిగ్ బాస్ విజేతగా ఎవరు నిలుస్తారా?? అనే ప్రశ్నకు సమాధానం కూడా దొరికేసింది. తొలి సీజన్లో శివ బాలాజీ విజేతగా నిలిచి అందరి మనసుల్నీ గెలుచుకొన్నాడు. నిజానికి శివ బాలాజీ ఎంపిక అనూహ్యమేం కాదు. వారం రోజుల నుంచి… బిగ్ బాస్ విజేతగా శివ బాలాజీనే నిలుస్తాడన్న ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. చివర్లో అర్చన, ఆదర్శ్ కాస్త పోటీ ఇచ్చినా – ప్రేక్షకుల అంచనాల్లో ఎలాంటి మార్పు రాలేదు. 11 కోట్ల పైచిలుకు ఓట్లు పోలయితే అందులో ఒక్క శివ బాలాజీకే 3 కోట్ల ఓట్లు రావడం… శివ బాలాజీపై టీవీ ప్రేక్షకులు పెంచుకొన్న ప్రేమకు నిదర్శనం.
అయితే.. ఈ గెలుపు శివ బాలాజీకి అంత తేలిగ్గా ఏం రాలేదు. 70 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో అతని క్రమశిక్షణే ఈ ప్రతిఫలాన్ని అందించింది. బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన కొత్తలో శివబాలాజీ అందరితోనూ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించేవాడు. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకొనేవాడు. అప్పట్లో శివ బాలాజీ చుట్టూ పోటీ కూడా ఎక్కువే ఉండేది. క్రమంగా… శివబాలాజీలో మార్పు రావడం కనిపించింది. తన కోపం బాగా తగ్గించుకొన్నాడు. ఎంత పెద్ద సమస్య నైనా చిరునవ్వుతో ఎదుర్కొనే వాడు. బిగ్ బాస్ హౌస్లో వంట చేయడం అనేది పెద్ద ప్రోసెస్. దాన్ని చిటికెలో చేసేసి, అందరి కడుపు నింపిన వ్యక్తి శివ బాలాజీనే. కొన్ని కీలకమైన సందర్భాల్లో హౌస్ మొత్తాన్ని ఒక్క తాటిలో నడిపేవాడు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే… బిగ్ బాస్ హౌస్లో అందరూ, ఏదో ఓ సందర్భంలో ఓవర్ యాక్షన్ చేసినవాళ్లే. కానీ… శివ బాలాజీ అలా కాదు. ఏం చేసినా అందులో నిజాయతీ కనిపించేది. ఆఖరికి కోపంలో కూడా. అదే… అందరికీ నచ్చింది. అందుకే… 3 కోట్ల పైచిలుకు ఓట్లు సాధించి విజేతగా నిలిచాడు.