ఇవాళ సాయంత్రం జై లవకుశ సక్సెస్ మీట్ జరిగింది. ఇందులో మాట్లాడుతూ తారక్ సినీ విశ్లేషకులపై విరుచుకుపడ్డాడు. బహుశా తారక్ ఇలా చేయడం ఇదే మొదటిసారి. తారక్ కంటే ముందు మాట్లాడిన కళ్యాణ్ రాం, బాబీ లాంటి వక్తలు సినిమాలో తారక్ నటనని ఆకాశానికెత్తేశారు. కళ్యాణ్ రాం అయితే “నేనే దిష్టిపెడుతున్నానేమో” అని కూడా అన్నాడు. ఇక ఆ తర్వాత ప్రసంగం ప్రారంభించిన తారక్ కూడా చంద్ర బోస్, రాం-లక్ష్మణ్, పోసాని లాంటి వాళ్ళ ప్రతిభని మెచ్చుకున్నాడు. అయితే ముగించే ముందు, తారక్ ఒక చిన్న ఉదాహరణ చెబుతూ, సినీ విశ్లేషకులని విమర్శించాడు.
ఆయన చెప్పిన ఉదాహరణ ఇది- “ఒకసారి ఒక పేషెంట్ ని అత్యవసర పరిస్థితి లో హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడ ఆ పేషెంట్ బంధువులంతా ఏం జరుగుతుందో అని కంగారు పడుతున్నారు. ఇక సంవత్సరాల కొలది ఎక్స్పీరియెన్స్ ఉన్న డాక్టర్లే అన్ని పరీక్షలు చేస్తే గానీ ఏ విషయం చెప్పలేం అని అంటున్నారు. అప్పుడు అక్కడ పిచ్చాపాటి గా తిరుగుతున్న ఎవడో దారినపోయే దానయ్య వచ్చి, ఏం జరిగిందో కనుక్కుని, “అబ్బే, లాభం లేదండీ, బతకడు” అని తేల్చేస్తాడు. పోనీ అతగాడికి ఏమైనా మెడికల్ ఫీల్డ్ లో ఎక్స్పీరియెన్స్ ఉందా అంటే, ఏమీ లేదు. మళ్ళీ ఇంకొకడెవడో వస్తాడు. “ఆహా అలా జరిగిందా, అయితే ఇది బ్రెయిన్ హ్యామరే, అస్సలు బతకడు” అని ఆ పేషెంట్ తాలూకు బంధువులతో అంటాడు. అసలు ఆ బంధువుల ఎమోషన్స్ తెలుసుకోకుండా వీళ్ళ నోటికి వచ్చింది వీళ్ళు వాగుతారు. ఇక్కడ ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్న ఆ పేషేంటే రిలీజ్ కి రెడీ గా ఉన్న సినిమా. ఆ బంధువులు – సినిమాకి పని చేసిన నటులు, టెక్నీషియన్లు. ఇక బాధ్యతా రహితంగా మాట్లాడిన ఆ దానయ్యలు ఈ సినీ విశ్లేషకులు. “సినిమా ఆడదంట కదా, అబ్బే కష్టమంట కదా” అని విశ్లేషిస్తారు వీళ్ళు సినిమా గురించి ఏమీ తెలీకుండానే.”.
ఇదీ తారక్ ప్రసంగం. ఇందులో కాస్తో కూస్తో నిజం లేకపోలేదు. అయితే తారక్ ప్రసంగానికి సక్సెస్ మీట్ లో మంచి స్పందనే వచ్చినా, ఇక విశ్లేషకులు, రివ్యూయర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.