నంద్యాల ఉప ఎన్నికను ఏపీలోని అధికార టీడీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో చూశాం. ఉప ఎన్నిక ఉంటుందని తెలిసిన దగ్గర నుంచీ ఆ నియోజక వర్గంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచారు. నిధులను గుమ్మరించారు. హుటాహుటిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసేశారు. ప్రజలకు వరాలు ఇచ్చేశారు. ఇక, ప్రచారం విషయానికొస్తే.. మంత్రులు నంద్యాలలో మకాం వేశారు. నియోజక వర్గాన్ని ప్రాంతాల వారీగా విభజించి మరీ పార్టీ బాధ్యతలు పంచుకున్నారు. అచ్చం ఇలాంటి సీనే ఇప్పుడు సింగరేణి ప్రాంతంలో కనిపిస్తోంది! నంద్యాలలో టీడీపీ చేసిన హడావుడే, ఇక్కడ తెరాస చేస్తోంది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్ని తెరాస చాలా సీరియస్ గా తీసుకుంది. అధికార పార్టీ సీరియస్ గా తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో నంద్యాలలో చూసిందే ఇక్కడా చూస్తున్నాం!
సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో ఏమాత్రం తేడా రాకూడదు అంటూ కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. అధికార పార్టీ తరఫున కార్మికుల సంక్షేమం కోసం ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా ఏమాత్రం ఏమరపాటుగా ఉండొద్దని కేసీఆర్ స్పష్టంగా ఆదేశించారట. దీంతో తెరాస నేతలు సింగరేణి గనులవైపు పరుగులు తీస్తున్నారు. అధికార పార్టీ కార్మిక సంఘమైన టి.బి.జి.కె.ఎస్.ను ఎలాగైనా గెలిపించి తీరాలనే ఒత్తిడి తెరాస నేతలపై ఉంది. పార్టీ ఇతర కార్యకలాపాలను కొన్నాళ్లు పక్కన పెట్టి, సింగరేణిపై దృష్టి పెట్టాలని నాయకులకు కేసీఆర్ చెప్పారట. దీంతో కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, సత్తుపల్లి ప్రాంతాల పార్టీ బాధ్యతల్ని నేతలు పంచుకున్నారు! మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం గనుల ప్రాంతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. కొత్తగూడెం గనుల ప్రాంతంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే జలగం చక్కర్లు కొడుతున్నారు. ప్రాంతాలవారీగా ప్రముఖ నేతల్ని పార్టీ ఇన్ఛార్జ్ లుగా నియమించారు. ఇతర సంఘాలను ఆకర్షించే బాధ్యతలు మరికొంతమందికి ఇచ్చారట!
కార్మికులను ఆకర్షించేందుకు దసరా, దీపావళి బోనస్ లను కూడా కేసీఆర్ సర్కారు ప్రకటించింది. మరోపక్క ఎంపీ కవిత కూడా ఇదే ప్రాంతంలో చక్కర్లు కొడుతూ.. సింగరేణిలో మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలనేదే కేసీఆర్ అభిమతమనీ, తెలంగాణకు సింగరేణి అక్షయపాత్ర అంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. టి.బి.జి.కె.ఎస్. గౌరవ అధ్యక్షురాలి హోదాలో కవిత ఉన్నారు. కాబట్టి, ఈ ఎన్నికల్ని ఆమె కూడా సీరియస్ గానే తీసుకుంటున్నారు. ఇతర సంఘాల నుంచి వచ్చి చేరుతున్నవారికి ఆహ్వానం పలుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి గనుల ప్రాంతాలకు ప్రజా ప్రతినిధులు వస్తున్నారంటూ కార్మికులు చెప్పుకుంటున్నారట! గతంలో ఏ ఎన్నికల్లో కూడా ఇంత హడావుడి కనిపించడం లేదని అంటున్నారు. కార్మిక సంఘాల ఎన్నికలను కూడా ఇంత ప్రతిష్టాత్మకంగా మార్చేసి.. అధికార పార్టీ మంత్రులూ ఎమ్మెల్యేలూ ఒకే ఎన్నికపై ఫోకస్ పెడుతుంటే ఈ మాత్రం హడావుడి లేకుండా ఎలా ఉంటుంది చెప్పండీ!