సూపర్‌స్టార్ మహేష్ హీరోగా, రకుల్ ప్రీత్ హీరోయిన్గా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పైడర్’. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి పతాకంపై ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్‌తో జరిపిన ఇంటర్వ్యూ.
‘స్పైడర్’ రేపు విడుదలవుతోంది. మీరెలా ఫీల్ అవుతున్నారు?
తెలుగులో సూపర్‌స్టార్ అయిన మహేష్‌తో తెలుగు, తమిళ భాషల్లో చిత్రం చేశాను అంటే నాకు తెలియకుండానే ఒక టెన్షన్ అనేది వుంటుంది. నేను ఫస్ట్ టైమ్ ద్విభాషా చిత్రం చేశాను కాబట్టి కాస్త ఎక్కువగానే వుంది.
తెలుగులో ‘స్టాలిన్’ చేశారు. రెండో సినిమాకి ఇంత గ్యాప్ తీసుకోవడానికి రీజన్ ఏమిటి?
తమిళ్లో నేను చేసిన తుపాకి, కత్తి సినిమాలు చేశాను. తుపాకి తెలుగులోకి డబ్ అయింది. రెండు సినిమాలు హిందీలో చేశాను. అలా తెలుగులో స్ట్రెయిట్ మూవీ చెయ్యడానికి గ్యాప్ వచ్చింది. ఈసారి డబ్బింగ్ కాకుండా బైలింగ్వల్ చేద్దామని డిసైడ్ అయ్యాను.
‘స్పెడర్’ చెయ్యడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశాలేమిటి?
ఇక్కడ రెండు విషయాల గురించి చెప్పుకోవాలి. మొదటిది హ్యుమానిటీ. పెద్ద డిజాస్టర్ ఏదైనా జరిగితే అక్కడ హ్యుమానిటీ అనేది వస్తుంది. కానీ, ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే దాన్ని వీడియో తీసి అందరికీ షేర్ చేద్దామనే అలోచనే వుంటుంది తప్ప హ్యుమానిటీ అందులో కనిపించదు. అదే 20 సంవత్సరాల క్రితం అలా లేదు. ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే అందరూ హెల్ప్ చెయ్యడానికి ముందుకు వచ్చేవారు. ఇప్పుడు ఏదైనా పెద్ద డిజాస్టర్, వరదలు లాంటివి వస్తే హ్యుమానిటీ అనేది బయటికి వస్తుంది. డిజాస్టర్ కోసం మనం వెయిట్ చెయ్యకూడదు. అందరికీ హెల్ప్ చెయ్యాలి. ఇన్‌డైరెక్ట్‌గా అదే మెసేజ్ ఇందులో వుంది. ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ వుండేవి. ఇప్పుడు భర్త, భార్య, పిల్లలు కలిసి వుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక డివైస్‌కి కనెక్ట్ అయి వుంటున్నారు. రెండో విషయానికి వస్తే ఇప్పుడు మన లైఫ్‌లో సీక్రెట్ అనేది లేదు. ఇంతకుముందు దేవుడంటే అందరికీ భయం వుండేది. ఇప్పుడు సీక్రెట్ కెమెరా అంటే భయం. ఏ క్రైమ్ జరిగినా దాన్ని చాలా ఈజీగా సాల్వ్ చెయ్యవచ్చు. ఒక మర్డర్ జరిగిన కొన్ని రోజుల తర్వాత కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ వున్నారనేది సీక్రెట్ కెమెరాతో కనిపెట్టవచ్చు. హ్యుమానిటి, ఐబి ఇంటెలిజెన్సీపైనే ఈ సినిమా వుంటుంది.
ఎస్.జె.సూర్యని విలన్‌గా తీసుకోవడానికి రీజన్?
విలన్ క్యారెక్టర్ టోటల్ డిఫరెంట్‌గా వుండాలనుకున్నాను. 50 మంది ఒక్కసారే వచ్చినా మహేష్ కొట్టగలడు. ఆ పవర్‌ని అతనిలో చూపించవచ్చు. ఇప్పటివరకు రౌడీలు, సుమోలు.. ఇలా మహేష్ సినిమాలో చాలా చూసేశాం. అలా కాకుండా కనిపించకుండా ఎక్కడో దాక్కొని వుండే ఒక విలన్. అతను ఎప్పుడైనా గొరిల్లా ఎటాక్ చెయ్యవచ్చు. అతనికి రూల్స్, చట్టం అనేది లేదు. ఫిజికల్‌గా కాకుండా మహాభారతంలో శకునిలా సైకలాజికల్‌గా దెబ్బతీసే విలన్. పది మంది స్ట్రాంగ్ విలన్స్ కంటే
ఎక్కువ పవర్ వున్న విలన్ అనిపిస్తుంది. మైండ్‌గేమ్ ఆడతాడు.
ఆ క్యారెక్టర్ని సూర్య అద్భుతంగా చేశాడు. సినిమా చూస్తే మనందరికీ ఈ క్యారెక్టర్ అంటే ఒక రకమైన భయం కలుగుతుంది.
ప్రస్తుతం కమర్షియల్ సినిమాల్లో మెసేజ్ ఇస్తే ప్రేక్షకులు చూస్తారా?
కమర్షియల్ ఫిలిమ్‌లో అయినా ఇన్‌డైరెక్ట్‌గా ఒక మెసేజ్ ఇస్తే డెఫినెట్‌గా ఆడియన్స్‌కి రీచ్ అవుతుంది. మెసేజ్ మాత్రమే ఇవ్వాలని సినిమా తీస్తే అది డ్రై అయిపోతుంది. ఒక పెద్ద హీరోతో చేస్తే ఈజీగా అందరికీ కనెక్ట్ అవుతుంది.
మహేష్ క్యారెక్టర్ ఎలా వుంటుంది?
ఐబి ఆఫీస్‌లో జూనియర్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ క్యారెక్టర్. చాలా స్టైలిష్‌గా వుంటుంది. ఇంటెలిజెన్సీ అనేది ఎలా వుంటుంది అనేది అతని క్యారెక్టర్ ద్వారా చూపిస్తున్నాం. హీరో, విలన్ మధ్య పవర్ఫుల్ ఎనిమిటీ వుంటుంది. దాన్ని మహేష్ చాలా అద్భుతంగా చేశారు.
ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ ఎక్కడ వుంటుంది?
టోటల్‌గా హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన సినిమా. తమిళ్ వెర్షన్లో కూడా హైదరాబాద్‌నే చూపించాం. స్క్రిప్ట్‌లో జాగ్రఫీ ఇంపార్టెన్స్ వుంది. కథ అంతా హైదరాబాద్‌లోనే జరుగుతుంది.
తుపాకి వంటి సినిమాలో ప్రతి సీన్ చాలా సహజంగా వుంటుంది. ఈ సినిమాలో హీరో సూపర్ హీరోలా కనిపిస్తున్నాడు. ఇలాంటి సినిమా ఫస్ట్‌టైమ్ చేస్తున్నారా?
ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్‌ని చూసి ప్రేక్షకులు ఏం అనుకుంటున్నారో నాకు తెలీదు. సినిమా చూడండి. ఇది హండ్రెడ్ పర్సెంట్ రియలిస్టిక్ మూవీ. సహజత్వానికి దూరంగా వుండే సన్నివేశాలు సినిమాలో ఎక్కడా కనిపించవు.
ఈ సినిమాలో వున్న హైలైట్స్ ఏమిటి?
ఇందులో ఒక రాక్ ఎపిసోడ్ వుంటుంది. దీని కోసం 25 రోజులు షూట్ చేశాం. 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు వుంటారు. ఆ ఎపిసోడ్లో చాలా రిస్కీ షాట్స్ కూడా వున్నాయి. అది కాకుండా ఒక రోలర్ కోస్టర్ ఫైట్ కూడా వుంది. దీనికి సినిమాలో చాలా ఇంపార్టెన్స్ వుంటుంది. సినిమాలో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయిన హీరో, ఫ్యామిలీ లేడీస్ కలిసి విలన్ని ఎలా పట్టుకునే 20 నిముషాల ఎపిసోడ్ సెకండాఫ్ మధ్యలో వస్తుంది. అది సినిమాకి పెద్ద హైలైట్ అవుతుంది.
మహేష్‌లాంటి హీరోతో రెండు భాషల్లో ఒకేసారి సినిమా చేయడం రిస్క్ అనిపించిందా?
బైలింగ్వల్ సినిమా అంటే కొన్ని షాట్స్ రెండు భాషల్లో ఒకేలా చెయ్యొచ్చు. కొన్ని సైలెంట్స్ షాట్స్‌ని రెండు భాషల్లో వాడొచ్చు. కానీ, ఈ సినిమాలో ప్రతి షాట్‌ని రెండు భాషల్లో తియ్యడం జరిగింది. ఇక్కడ మహేష్ సూపర్‌స్టార్ కాబట్టి దానికి తగ్గట్టుగానే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వుంటుంది. తమిళ్లో కొత్త హీరో కాబట్టి దానికి తగ్గట్టుగానే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశాం. తెలుగు సినిమా చూసిన తర్వాత తమిళ్ సినిమా చూస్తే ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది.
ప్రభాస్‌కి స్టోరీ నేరేట్ చేశారని తెలిసింది?
అది నిజం కాదండీ. ఫ్రెండ్లీగా ఫోన్లో మాట్లాడాను తప్ప పర్సనల్‌గా కలవలేదు, ఏ ప్రాజెక్ట్ గురించీ డిస్కస్ చెయ్యలేదు.
రజనీకాంత్‌తో సినిమా ఎప్పుడు?
రెండు, మూడు సార్లు ఆయన్ని కలిసాను. కథ కూడా చెప్పాను. డేట్స్ కుదరలేదు. మా కాంబినేషన్లో సినిమా తర్వాత వుండొచ్చు.
‘స్పైడర్’ నిర్మాతల గురించి?
ఠాగూర్ మధుగారు నాకు 10 సంవత్సరాల నుంచి పరిచయం. తమిళ్లో రమణ చేసినపుడు ఆ సినిమా నిర్మాత ఫ్రెండ్ మధుగారు. రమణ రిలీజ్‌కి ముందే తెలుగులో చిరంజీవిగారితో రీమేక్ చెయ్యాలనుకున్నారు. తర్వాత హిందీ గజిని, స్టాలిన్ చేశాం. నాలుగు సినిమాలు కంటిన్యూగా చేశాం. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో మధుగారు, ప్రసాద్‌గారు కామన్‌గా అందరికీ తెలుసు. తమిళ్ ఇండస్ట్రీలో ఎవరైనా తిరుపతి వెళ్ళాలంటే ప్రసాద్‌గారి ద్వారానే వెళ్లాలి. కత్తి టైమ్‌లో కూడా నాకు హెల్ప్ చేశారు. ‘స్పైడర్’ మేకింగ్‌లో ఇద్దరి సహకారం మర్చిపోలేను. ప్రసాద్‌గారు సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా వర్క్ చేశారు.
చిరంజీవిగారితో చేశారు. ఇప్పుడు మహేష్‌తో సినిమా చేశారు. ఇద్దరిలో ఎవరితో మీకు కంఫర్ట్ అనిపించింది?
10 సంవత్సరాల క్రితం స్టాలిన్ చేశాను. నేను అప్పుడు చాలా యంగ్, చిరంజీవిగారు చాలా సీనియర్. నేను డైరెక్టర్‌గా అప్పుడు కొత్తవాడిని. చిరంజీవిగారితో సినిమా చెయ్యడం అంటే ఒక భయం అనేది వుంది. ఫస్ట్‌టైమ్ నా మాతృభాష కాకుండా మరో లాంగ్వేజ్‌లో చేస్తున్నానంటే టెన్షన్‌గానే వుంటుంది కదా. అయినా చిరంజీవిగారితో సినిమా చేయడం కంఫర్ట్‌గానే ఫీల్ అయ్యాను. ఇప్పుడు మహేష్‌తో సినిమా చేస్తున్నానంటే టెన్షన్ ఏమీ లేదు. ఎందుకంటే మహేష్ 10 సంవత్సరాలుగా నాకు పరిచయం. ‘స్పైడర్’తో బాగా క్లోజ్ అయ్యాం. మంచి ఫ్రెండ్స్ అయిపోయాం.
మీతో సినిమాలు చేసిన హీరోలను అంతకుముందు కంటే డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తారనే పేరు వుంది. ఈ సినిమాలో మహేష్‌ని ఎలా చూపించారు?
మహేష్ చేసిన సూపర్‌హిట్ సినిమాలు చూశాను. స్క్రిప్ట్‌కి తగ్గట్టుగా, క్యారెక్టర్‌కి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్‌లో హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇలాంటి క్యారెక్టర్ మహేష్ ఇంతకుముందు చెయ్యలేదు. బాడీ లాంగ్వేజ్ విషయంలోగానీ, యాక్షన్ సీక్వెన్స్లలోగానీ మా ఇద్దరిదీ ఒకే టేస్ట్. నేచురల్‌గా వుండాలి, ఫైట్స్ అనగానే గాల్లోకి ఎగిరిపడేలా వుండకూడదు అనుకుంటాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్.