హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును త్వరలో పూర్తి చేయబోతున్నట్టు తెరాస సర్కారు ఈ మధ్య చెబుతూ వస్తోంది. నగరంలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం ఈ ప్రాజెక్టుతోనే సాధ్యం అంటూ, మెట్రో అందుబాటులోకి తెచ్చిన ఘనత తమకే దక్కబోతోందంటూ తెరాస నేతలు చెప్పుకుంటున్నారు. భాగ్యనగరంలో మెట్రో రైలు పరుగులు తీస్తే, వచ్చే ఎన్నికల్లో అదో సానుకూలాంశం అవుతుంది కదా! అయితే, ఈ తరుణంలో ఉన్నట్టుండి.. కాంగ్రెస్ కి మెట్రో రైలు గుర్తొచ్చింది. ఈ ప్రాజెక్టును మనమే ప్రారంభించాం కదా, వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనదే ఈ ఆలోచన కదా, మనమే టెండర్లు పిలిచాం కదా, ఆ లెక్కన మెట్రోకి పునాదులు వేసిన ఘనత మనకే దక్కాలని కదా అంటూ కాంగ్రెస్ సిద్ధమౌతూ ఉండటం విశేషం! ప్రాజెక్టు తమదనీ, తెరాసకు పేరెలా వస్తుందని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కొత్త వాదన అందుకుంటున్నారు. విశేషం ఏంటంటే.. ఈ వాదనతో చాన్నాళ్ల తరువాత దానం నాగేందర్ తెరమీదికి రావడం!
తమ హయాంలో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభం అయిందనీ, కానీ తెరాస అధికారంలోకి వచ్చాక అనుకున్న సమయంలోపు నిర్మాణం పూర్తి చేయలేకపోయారంటూ కేసీఆర్ పనితీరుపై దానం నాగేందర్ విమర్శలు గుప్పించారు. భాగ్యనగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు ప్రాజెక్టును ఆనాడు ప్రారంభించామన్నారు. ఈ ప్రాజెక్టు 2014 నాటికి పూర్తి కావాలనేది రాజశేఖర్ రెడ్డి స్వప్నం అని చెప్పారు. దురదృష్టవశాత్తూ ఆయన అకాల మరణం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆలస్యం అయిందని దానం అన్నారు. ఉద్యమం నేపథ్యంలో ఓ రెండేళ్లు ఆలస్యమైనా ఇప్పటివరకూ తెరాస పూర్తి చేయలేకపోయిందన్నారు. రూ. 14 వేల కోట్లతో మొదలైన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఇప్పుడు రూ. 18 వేల కోట్లకు పెంచారనీ, దానికి తెరాస బాధ్యత వహించాల్సిందే అన్నారు. పెరిగిన నిర్మాణ వ్యయ భారమంతా జంట నగరాల ప్రజల మీదే మోపుతారన్నారు. ఇదే అంశమై పార్టీ తరఫున నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నట్టు దానం చెప్పారు.
మెట్రో పునాదులు తామే వేశామని, ఆ క్రెడిట్ తమకే దక్కుతుందని ఇన్నాళ్లకు కాంగ్రెస్ కు గుర్తుకురావడం ఒక విశేషం! ఈ విషయంతో దానం నాగేందర్ మళ్లీ వార్తల్లోకి రావడం ఇంకో విశేషం. నిజానికి, గ్రేటర్ ఎన్నికల సమయంలో ఈయన తెరాసలోకి చేరిపోతారనే ప్రచారం జరిగింది. దానం వర్గం కూడా చేరికపై అవుననే చెప్పింది. కానీ, చివరి నిమిషంలో లెక్కలు మారిపోయి, ఆయన వెనక్కి తగ్గిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత, పార్టీ కార్యకలాపాల్లో ఆయన ఏమంత చురుగ్గా పాల్గొన్నదీ లేదు. అయితే, వచ్చే ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఇప్పట్నుంచే అధిష్టానం అప్రమత్తం చేస్తుండటంతో.. ఈ మధ్య కాస్త హడావుడి పెరిగింది. మరి, భాగ్యనగరంలో ఉంటూ పార్టీ తరఫున ఏ కార్యక్రమమూ చేపట్టకపోతే ఎలా అనే ఒత్తిడి ఏదైనా దానం పడిందో అనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఎలాగూ తెరాసలో చేరే పరిస్థితి లేదు. రాజకీయంగా భవిష్యత్తు కావాలంటే ఉన్న కాంగ్రెస్ లోనే మరోసారి ఉనికిని చాటుకోవాలి కదా! ఏదో ఒక కార్యక్రమం పేరుతో హడావుడి చేయాలి!