తెలంగాణకు కొత్త సచివాలయం అవసరమా.. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని క్రీడా మైదాన ప్రాంతంలో కొత్త సెక్రటేరియట్ కట్టేందుకు కేసీఆర్ ఎప్పుడో డిసైడ్ అయ్యారు. ఉన్న సచివాలయానికి వాస్తు బాలేదన్న ఒకే ఒక్క కారణంతో ఇంత భారీ నిర్మాణానికి తెరాస సర్కారు సిద్ధమౌతోందనే విమర్శలూ తీవ్రస్థాయిలో వినిపిస్తూ ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఉన్నది సరిపోతుంది కదా, అదనంగా ప్రజాధనంఎందుకు దుర్వినియోగం చేయడం, పైగా ఇప్పుడు సెక్రటేరియట్ నుంచి ఆంధ్రా ప్రభుత్వం కూడా పూర్తిగా ఖాళీ చేసింది కదా అనేది కాంగ్రెస్ వాదన. ఇదే అంశాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుని వెళ్లేందుకు ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ నేత వీ హనుమంతరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కోట్ల ఖర్చుతో కొత్త సచివాలయ నిర్మాణంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని వీహెచ్ అన్నారు. క్రీడాకారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారనీ, తమకు ఉన్నది ఇదొక్కటే మైదానమనీ, దీన్లో కూడా నిర్మాణాలు చేపడితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నట్టు వీహెచ్ చెప్పారు. ఉన్న సెక్రటేరియట్ వాస్తు బాలేదంటూ ముఖ్యమంత్రి సాకులు చెప్పడం న్యాయం కాదన్నారు. నమ్మకాల పేరుతో ప్రజాదనం దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ‘నీ వాస్తు బాగుంది కాబట్టే నువ్వు ముఖ్యమంత్రివి అయినావు. ఇంకా ప్రత్యేకంగా వాస్తులు మార్చాల్సిన అవసరం లేదు. నువ్వింకా వాస్తులు చూడకు. మా వాస్తు బాలేదు కాబట్టే మా పరిస్థితి ఇలా ఉంది. తెలంగాణ ఇచ్చింది మేము, కొత్త రాష్ట్రాన్ని తెచ్చింది మేము. కానీ, మా వాస్తు సరిగా లేకపోవడంతో అధికారంలోకి రాలేకపోయాం’ అన్నారు వీహెచ్.
కాంగ్రెస్ పార్టీకి వాస్తు బాలేదని వీహెచ్ గుర్తించడం మంచిదే. మరి, దాన్ని సరిచేసుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేస్తున్నారా లేదా అనేది కూడా చెబితే బాగుండేది. కాంగ్రెస్ పార్టీలో వాస్తు దోషం ఎక్కడుందో తెలియాలంటే ప్రస్తుతం నిర్వహించిన కార్యక్రమమే చూడండి… ఈ ప్రజా బ్యాలెట్ గురించి ఇతర నేతలెవ్వరూ పెద్దగా మాట్లాడటం లేదు. సచివాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమంలో మొదట్నుంచీ వీహెచ్ స్వరమే పెద్దగా వినిపిస్తోంది. ఆయనే ఆమధ్య గ్రౌండ్ కి వెళ్లి, అక్కడున్న క్రీడాకారులతో మాట్లాడారు. ఇప్పుడీ ప్రజా బ్యాలెట్ కార్యక్రమంలో కూడా వీహెచ్ తోపాటు షబ్బీర్ అలీ కాస్త యాక్టివ్ గా కనిపించారు. మిగతా నేతలంతా ఏమయ్యారు..? ప్రముఖులంతా ఎక్కడున్నారు..? వారంతా కలిసికట్టుగా వచ్చి ఉంటే.. ఈ కార్యక్రమం మరింత సక్సెస్ అయ్యేది కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాస్తు దోషం ఇదే! ఒకే మాటతో కలిసికట్టుగా నేతలంతా కార్యక్రమాలు నిర్వహిస్తే వాస్తు సెట్ అయిపోతుంది కదా.