ఇచ్చిన ఫ్లాపులు పాపంలా వెంటాడడం అంటే ఇదే! `ఆగడు` ఫ్లాప్ తో శ్రీనువైట్ల ఇమేజ్‌కి దారుణమైన డామేజీ కలిగింది. ఆ సినిమా తరవాత 14 రీల్స్ సంస్థకీ, శ్రీనువైట్లకు గ్యాప్ పెరిగిపోయింది. ‘బ్ల్రూస్లీ’తో మరో భారం మోయాల్సివచ్చింది. ‘మిస్టర్’ కూడా డిజాస్టర్ జాబితాలో కలిసిపోయింది. ఫ్లాప్ అనే మాట పక్కన పెడితే శ్రీనువైట్లకూ, నిర్మాత ఠాగూర్ మధుకీ మధ్య వైరానికి కారణమైంది. ‘నీ వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది’ అంటూ దర్శకుడ్ని వేలెత్తి చూపించేంత దూరం వెళ్లింది వ్యవహారం. ఇప్పుడు శ్రీనువైట్లపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు కూడా నమోదైంది. `మిస్టర్` కి అనుకొన్న బడ్జెట్ వేరు…. చివరికి తేలింది వేరు. ఈ బడ్జెట్ పెరగడానికి శ్రీనువైట్లనే కారణం అన్నది నిర్మాత వాదన. చివర్లో అనవసరంగా ఓ పాట యాడ్ చేశారని, సన్నివేశాల్ని పెంచుకొంటూ వెళ్లారని, దాంతో బడ్జెట్ తడిసిమోపెడైందని నిర్మాత తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు స్పష్టమైంది. అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో నిర్మాత తప్పులేకపోలేదు.
ఆ సినిమా జరుగుతున్నప్పుడు మాత్రం శ్రీనువైట్లని గుడ్డిగా నమ్మాడు ఠాగూర్ మధు. పాట అవసరమో, కాదో.. నిర్మాతకు తెలీదా?? దర్శకుడు అడిగిందల్లా ఇవ్వడం, తీరా సినిమా అటూ ఇటూ అయితే.. వేలెత్తి చూపించడం? ఇదేనా దర్శక నిర్మాతల మధ్యన ఉండాల్సిన అవగాహన..?? మిస్టర్ తరవాత శ్రీనువైట్ల – ఠాగూర్ మధుల మధ్య చర్చలు కూడా జరిగాయి. ‘మీ కోసం ఫ్రీగా మరో సినిమా చేసి పెడతా’ అని శ్రీనువైట్ల వాగ్దానం కూడా చేసినట్టు తెలుస్తోంది. మరి ఏమైందో.. శ్రీనువైట్ల తన ప్రామిస్‌ని నిలుపుకోవడానికి ఆలోచిస్తున్నాడట. శ్రీనువైట్లతో ఇప్పుడు సినిమా తీసినా.. హిట్టయ్యే పరిస్థితి లేదని ఠాగూర్ మధు కూడా ఓ అభిప్రాయానికి వచ్చేశాడని తెలుస్తోంది. అందుకే నష్టపరిహారం కింద పారితోషికంలో కొంతమొత్తం వెనక్కి తీసుకొని ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని చూస్తున్నారు. కేసు మొత్తం ఇప్పుడు నిర్మాతల మండలి ఆధీనంలో ఉంది. అందులో ఠాగూర్ మధు పెద్ద తలకాయే. సో.. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.