జాతకాలు, వాస్తు, ముహూర్తాలు, మంచిరోజులు.. ఇలాంటి నమ్మకాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కాస్త ఎక్కువ అని అంటారు! జ్యోతిష్కులు, పండితుల సలహాలు లేకుండా ఆయన ఏపనీ చేయరని చెబుతుంటారు. కానీ, విపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇలాంటి అంశాలు ఎప్పుడూ వినిపించేవి కావు. ముహూర్తాలు, జ్యోతిష్కుల సలహాలు వంటి అంశాల గురించి ఆయన పెద్దగా ఆలోచించరు అనేవారు! అయితే, ఈ మధ్య జగన్ తీరులో కొంతమార్పు వచ్చినట్టు ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ నెల 27 నుంచి తలపెట్టిన పాదయాత్రను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజు ముహూర్తం బాగులేదనీ, నవంబర్ 2న ప్రారంభిస్తే భేషుగ్గా ఉంటుందనీ, ఆశించిన ఫలితాలు దక్కుతాయని జ్యోతిష్కులు చెప్పడంతోనే ఆ తేదీని జగన్ ఖరారు చేశారని కొన్ని కథనాలు వచ్చాయి! ఇదొక్కటే అనుకుంటే.. ఇప్పుడు మరో కీలకమైన నిర్ణయం విషయంలో కూడా జగన్ మాంచి ముహూర్తం చూసుకునే బయలుదేరినట్టు తెలుస్తోంది!
కొంతమంది పండితుల సలహా మేరకు దుర్గాష్టమి రోజున పార్టీకి సంబంధించి ఓ కీలకమైన ముందడుగు వేశారంటూ ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ.. ఆ ముందడుగు ఏంటంటే, కేంద్రంలోని భాజపాకి దగ్గయ్యే అన్ని మార్గాల నుంచీ ప్రయత్నాలు చేయడం! దీన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ప్రముఖ ఎంపీ కుమారుడితో జగన్ రహస్యంగా కలుసుకున్నట్టు తెలుస్తోంది. దుర్గాష్టమి నాడు హైదరాబాద్ లో ఉంటున్న ఓ ఎంపీ కుమారుడి దగ్గరకు జగన్ వెళ్లారనీ, దాదాపు రెండు గంటలకుపైగా వారి మధ్య చర్చలు జరిగినట్టు చెబుతున్నారు. ఆ ఎంపీ కుమారుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా.. భాజపా అనుబంధ సంస్థలతోపాటు, కొంతమంది ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయనీ, అందుకే జగన్ కలుసుకున్నారని అంటున్నారు. భాజపాతో తనకు మొదట్నుంచీ విబేధాలు లేవనీ, రాష్ట్రపతీ ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో సహకరించిన తీరును కూడా ఈ సందర్భంగా గుర్తు చేసినట్టు ఆ కథనం సారాంశం.
నిజానికి, భాజపాకు దగ్గరయ్యే ప్రయత్నాలు జగన్ ఎప్పుడో మొదలుపెట్టారు. అదేమంత కొత్త విషయం కాదు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగానే ఆ విషయం అర్థమైంది. ఓ పక్క జగన్ ని కూడా ప్రత్యామ్నాయంగా దగ్గర చేసుకుంటే బాగుంటుందనే ధోరణిలో భాజపా వ్యవహరించింది. జగన్ ను దూరంగా ఉంచాల్సిన అవసరంగానీ, రాజకీయ వైరంగానీ భాజపాకి లేదు… టీడీపీతో ఉన్న పొత్తు తప్ప! అయితే, నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తరువాత కేంద్రంలోని భాజపా వైఖరిలో కొంత స్పష్టత వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో టీడీపీతోనే పొత్తు కొనసాగొచ్చనే సంకేతాలు కేంద్రం నుంచి వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో భాజపాతో దగ్గరయ్యే ప్రయత్నాలను జగన్ పునః ప్రారంభించాల్సిన పరిస్థితే ఇప్పుడు నెలకొందని చెప్పాలి.
అయితే, కొంతమంది జ్యోతిష్కుల సలహా మేరకు ఈ పనిని జగన్ ప్రారంభించడం విశేషంగా చెప్పుకోవాలి. ఇకపై ఏ పనిచేసినా మంచి రోజులు, ముహూర్తాలు చూసుకుని బయలుదేరాలని జగన్ నిర్ణయించుకున్నట్టుగా ఉన్నారు. బహుశా, వరుస వైఫల్యాల నేపథ్యంలో ఇకపై అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతోనే జగన్ కూడా ఈ రూటుకి వచ్చేసినట్టుగా ఉంది!